
కోనసీమ జిల్లా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావుకు ఊరట లభించింది. ఆయన ఎన్నికపై దాఖలైన ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్ విచారణను పూర్తి చేశారు. కాగా.. ఈ ఏడాది మార్చిలో జరిగిన వైసీపీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో తాను ఎన్నికల్లో గెలుపొందేందుకు దొంగ ఓట్లు కూడా కారణమంటూ రాపాక తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై కేశవదాసుపాలెం గ్రామానికి చెందిన ఎనుముల వెంకటపతిరాజా రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
దీనిపై ఈసీ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ విచారణ చేపట్టారు. దీనిలో భాగంగా ఎమ్మెల్యే వరప్రసాదరావుతో పాటు మరో ఎనిమిది మందిని విచారించి, వారి నుంచి లిఖితపూర్వక వివరణ తీసుకున్నారు. ఈ సందర్భంగా తాము ఎమ్మెల్యేకు ఓట్లు వేయలేదని వైసీపీ కార్యకర్తలు తెలిపారు. అప్పుడు జనసేన నుంచి పోటీ చేసిన రాపాకకు ఏ విధంగా దొంగ ఓట్లు వేస్తామని కార్యకర్తలు వెల్లడించారు. ఈ నేపథ్యంలో విచారణ వివరాలను జిల్లా కలెక్టర్ ఈసీకి సమర్పించనున్నారు.
అసలేం జరిగిందంటే..
దొంగ ఓట్లతోనే తనకు మెజారిటీ వచ్చిందని రాపాక చెబుతున్న వీడియో ఒకటి ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఒక సందర్భంలో రాపాక వరప్రసాద్ మాట్లాడుతూ.. తన సొంత ఊరులో చింతలమోరులో తనకు దొంగ ఓట్లు వేశారని అన్నారు. చింతలమోరులో కాపు ఓట్లు ఉండవని.. అన్ని ఎస్సీ ఓట్లే ఉంటాయని చెప్పారు. ఎవరూ ఎవరికి తెలియదని.. ఎవరూ ఎటు నుంచి వచ్చినా అక్కడేం చేయలేరని అన్నారు. సుభాష్‌తో పాటు వారి జట్టు వచ్చేసి.. ఒక్కొక్కరు ఐదారు ఓట్లేసేవారని అన్నారు. 15 నుంచి 20 మంది వచ్చేవాళ్లను.. ఒక్కొక్కరు పదేసి ఓట్లేసేవారని చెప్పారు. తన గెలుపుకు అప్పటి నుంచి కారణం అదేనని.. మెజారిటీ ఏడు, ఎనిమిది వందలు వచ్చేదని అన్నారు.
Also Read: ఎమ్మెల్యే రాపాకకు చిక్కులు తెచ్చిపెట్టిన వైరల్ వీడియో.. ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు..
అయితే తన వ్యాఖ్యలపై రాపాక వరప్రసాద్ తాజాగా వివరణ ఇచ్చుుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు దొంగ ఓట్లు వేశారని తాను చెప్పలేదని.. ఎప్పుడో 32 ఏళ్ల క్రితం జరిగిన దాని గురించి చెప్పానని అన్నారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పారు. బొంతు రాజేశ్వరరావు జనసేనలోకి వెళ్లారని.. అయితే ఆయన అనుచురులు మాత్రం వైసీపీలో ఉన్నారని.. వాళ్ల కోరిక మేరకే ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగిందని తెలిపారు.
గత ఎన్నికల్లో ఎస్సీలో కొంతమందిని మినహాయిస్తే అందరూ వైసీపీకే ఓటు వేశారని చెప్పారు. అప్పుడు అయితే తనకు ఓట్లు వేసింది జనసైనికులేనని అన్నారు. టీడీపీని విమర్శిస్తే జనసైనికులు ఎందుకు ఆందోళనకు దిగారని ప్రశ్నించారు. 32 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనను మాత్రమే తాను చెప్పానని.. కానీ వక్రీకరించారని మండిపడ్డారు. అప్పుడు కూడా వాళ్లు వేశామని చెబితే.. తాను వేయించలేదు కదా అని నవ్వేసి ఊరుకునేవాడినని అన్నారు.