
పోలవరం ప్రాజెక్ట్ (polavaram project) విషయంలో ఏపీ ప్రభుత్వానికి (ap govt) ఊరట కలిగింది. ఈ ఆనకట్ట పర్యావరణ అనుమతుల విషయంలో రెండేళ్ల పాటు ఏపీ ప్రభుత్వానికి ఉపశమనం లభించింది. అనుమతులు లేని కారణంతో 2011లో కేంద్రం పనుల నిలుపుదల ఉత్తర్వులు జారీ చేసింది. 2015లో ఉత్తర్వులను అభయెన్సులో పెట్టింది కేంద్ర పర్యావరణ శాఖ (union forest and environment ministry) . ఈ అభయెన్సు ఉత్తర్వులను ఏటా కొనసాగిస్తూ వచ్చింది కేంద్రం. తాజాగా ఏపీ, కేంద్ర జలశక్తి శాఖ అభ్యర్ధనతో రెండేళ్ల పాటు కొనసాగిస్తున్నట్లు తెలిపింది.
కాగా.. గోదావరి, కృష్ణా నదులను అనుసంధానిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా, పోలవరం సమీపంలో నిర్మాణంలో ఉన్న బహుళార్థ సాధక నీటిపారుదల పథకం పోలవరం ప్రాజెక్ట్‌ను గతేడాది డిసెంబర్‌లో కేంద్ర నిపుణులు సందర్శించారు. పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరు, నాణ్యతపై కేంద్ర జల్ శక్తి శాఖ ఉన్నత స్థాయి కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింది. ప్రాజెక్టు స్పిల్ వే, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు, అనుసంధానాల పనులు, జలవిద్యుత్ కేంద్రం కొండ తవ్వకం పనులు, గ్యాప్–1లను, పునరావాస కాలనీలను తనిఖీ చేసింది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ప్రాంతాన్ని కూడా పరిశీలించింది. ఈ క్రమంలో పోలవరం ప్రాజెక్టు కు సంబంధించి కొనసాగుతున్న పనులపై సంతృప్తిని వ్యక్తం చేసింది కమిటీ. పోలవరం ప్రాజెక్టు వివరాలను ప్రాజెక్టు సీఈ బి.సుధాకర్‌బాబు, ఎస్‌ఈ కె.నరసింహమూర్తుల నుంచి తెలుసుకున్నారు. నిర్వాసితులకు పునరావాసం పనులను వేగవంతం చేయాలని కమిటీ ఆదేశించింది.
ఈ క్రమంలోనే పోలీవరం ప్రాజెక్టు పనులు మరింత వేగంగా కొనసాగించడానికి అధికారులు కమిటీ ముందు కొన్ని విన్నపాలు చేశారు. 2017–18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయానికి పెట్టుబడి అనుమతి ఇచ్చి, ఆ మేరకు నిధులు విడుదల చేస్తే మరింత వేగంగా పునరావాసం కల్పిస్తామని అధికారులు పేర్కొన్నారు. ఈ వ్యయాన్ని సీడబ్ల్యూసీ సాంకేతిక సలహా కమిటీ 2019లోనే ఆమోదించిందని వివరించారు. ఆ తర్వాత రివైజ్ట్ కాస్ట్ కమిటీ రూ.47,727.87 కోట్లకు అంచనా వ్యయాన్ని ఆమోదించిందన్నారు.
సవరించిన అంచనా వ్యయానికి పెట్టుబడి అనుమతి ఇచ్చి, ఆ మేరకు నిధులు విడుదల చేస్తే గడువులోగా పోలవరం ప్రాజెక్టు పనులను పూర్తి చేయవచ్చని వెల్లడించారు. దేశంలోని ఇతర జాతీయ ప్రాజెక్టుల తరహాలోనే పోలవరానికి నిధులు కేటాయింపు జరపాలని అన్నారు. ముఖ్యంగా అన్ని ప్రాజెక్టుల మాదిరిగా నీటిపారుదల, సరఫరా విభాగం వ్యయాన్ని ఒకటిగానే లెక్కించి, నిధులివ్వాలని సీడబ్ల్యూసీ నివేదిక ఇచ్చిందని వివరించారు. దీనిపైజల్ శక్తి శాఖ కమిషనర్ ఏఎస్ గోయల్ సానుకూలంగా స్పందించారు. సీడబ్ల్యూసీ నివేదికను కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దృష్టికి మళ్లీ ఇంకోసారి తీసుకువెళ్తానని ఆయన తెలిపారు.