పరిటాలకు సవాలు విసిరిన భానుమతి

First Published Dec 14, 2017, 9:01 AM IST
Highlights
  • అనంతపురం రాజకీయాల్లోకి దూకటానికి మళ్ళీ మద్దెలచెరువు(గంగుల) భానుమతి రెడీ అని ప్రకటించారు.

అనంతపురం రాజకీయాల్లోకి దూకటానికి మళ్ళీ మద్దెలచెరువు(గంగుల) భానుమతి రెడీ అని ప్రకటించారు. ప్రత్యర్ధులతో తలపడటానికి ఇప్పటికిప్పుడు సవాలంటున్నారు. రాప్తాడునియోజవకర్గంలో గడచిన మూడు రోజులుగా భానుమతి జగన్ తోనే కనిపిస్తున్నారు. జగన్ ఆదేశిస్తే జిల్లాలో ఎక్కడినుండైనా సరే పోటీకి సై అంటున్నారు. కాగా భానుమతి 2004 ఎన్నికల్లో పరిటాల రవితో పెనుకొండలో పోటీ చేసి ఓడిపోయారు. పరిటాల-మద్దెలచెర్వు కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ రాజకీయాలు ఏ స్ధాయిలో నడిచాయో కొత్తగా చెప్పక్కర్లేదు.

ఫ్యాక్షన్ కారణంగా ఇరువైపుల ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో లెక్కేలేదు. చివరకు అదే ఫ్యాక్షన్ కు పరిటాల రవితో పటు మద్దెలచెరువు సూరి కూడా బలైపోయారు. ఎప్పుడైతే భర్త సూరి చనిపోయారో అప్పటి నుండి భానుమతి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. మళ్ళీ ఇంత కాలానికి క్రియాశీలం కావాలని అనుకున్నారు. అదే విషయాన్ని ప్రకటిచారు.

వ్యక్తిగత కారణాలతోనే తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు మీడియాతో చెప్పారు. భర్త మరణం తర్వాత తమ వర్గం బలహీనపడిందని భానుమతి అంగీకరించారు. ప్రత్యర్ధులను హతమార్చాలనుకుంటే అదేమీ పెద్ద విషయం కాదన్నారు. కాకపోతే ఫ్యాక్షనిజం వల్ల జరిగే నష్టం తనకు తెలుసు కాబట్టే దూరంగా ఉంటున్నట్లు స్పష్టం చేశారు. అయితే, చంద్రబాబునాయుడు ఫ్యాక్షనిజాన్ని మళ్ళీ ప్రోత్సహిస్తున్నట్లు మండిపడ్డారు.

అదే సమయంలో పరిటాల రవి భార్య, మంత్రి పరిటాల సునీత మీడియాతో మాట్లాడుతూ, జగన్ ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలు చేయటం గమనార్హం. జిల్లాలోని ప్రశాంత వాతావరణాన్ని జగన్ భగ్నం చేస్తున్నారట. తమ కుటుంబం ఎప్పుడూ ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహించలేదని చెప్పటం విచిత్రంగా ఉంది. జిల్లాకు హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా నీరు అందటాన్ని జగన్ ఓర్వలేకున్నట్లు సునీత మండిపడటం గమనార్హం. 

మొత్తం మీద భానుమతి మళ్ళీ రాజకీయాల్లో క్రియాశీలం కావటం ఓ విధంగా వైసిపికి ప్లస్సనే చెప్పాలి. ఎందుకంటే, పెనుకొండ నియోజవకర్గంలో పరిటాల వర్గాన్ని దీటుగా ఎదుర్కోగలిగే సత్తా ఒక్క భానుమతి వర్గానికి మాత్రమే ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. భానుమతి వర్గానికి మైనెస్సులు కూడా ఉన్నప్పటికీ జనాల్లో ప్రభుత్వవ్యతిరేకత గనుక నిజమైతే పరిటాలవర్గానికి కష్టకాలం మొదలైనట్లే.

click me!