
అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ ఐకాసా చైర్మన్ బండి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన గతంలో ముఖ్యమంత్రి జగన్ ను పొగడ్తలు ముంచెత్తిన ఘటనకు సంబంధించి తన కార్యవర్గ సభ్యులకు వివరణ ఇచ్చే నేపథ్యంలో ఈ మేరకు వ్యాఖ్యానించారు. ‘ముఖ్యమంత్రి జగన్ ను పొగిడితేనే ఏదైనా పని చేస్తారు. పోరాటం అంటే దగ్గరకి కూడా రానివ్వరు. అందుకే మొన్న ఆయనను కలిసినప్పుడు పొగిడాను’ అని చెప్పుకొచ్చారు.
అయితే, తాను అన్న మాటలను ఉన్నది ఉన్నట్టుగా కాకుండా.. ముందూ, వెనకా కొన్ని ఎడిటింగ్లు చేసి బయటికి విడుదల చేశారని చెప్పుకొచ్చారు. ఐకాసా జగన్ కు అండగా ఉంటుందని ఐకాస చైర్మన్ బండి శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి హామీ ఇవ్వడం తమతో చర్చించలేదని.. ముఖ్యమంత్రిని పొగడ్తలతో ముంచెత్తడం…లాంటి అంశాల మీద విజయవాడలోని ఏపీ ఎన్జీవో హోంలో గురువారం ఆంధ్రప్రదేశ్ ఐకాస కార్యవర్గ సమావేశం నిర్వహించారు.
నాపై పోటీకి దిగు: పవన్ కల్యాణ్‌పై ముద్రగడ మరో లేఖాస్త్రం
ఈ సమావేశంలో ఐక్యఉపాధ్యాయ సంఘం (యుటిఎఫ్), రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్టీయూ)లు శ్రీనివాసరావును నిలదీసాయి. తమతో కనీసం చర్చించకుండా సీఎం జగన్ కు ఐకాస అండగా ఉంటుందని ఎలా ప్రకటించారని ప్రశ్నించింది. తమ ప్రధాన డిమాండ్లు.. కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం (సిపిఎస్)ను రద్దు చేయడం.. పాత పెన్షన్ (ఓపిఎస్) విధానాన్ని పునరుద్ధరించాలన్నదేనని.. అయితే జిపిఎస్ బాగుందని ఎలా చెబుతారు అంటూ నిలదీశారు. 12వ పీఆర్సి వేయడం కంటే ముందు ఐఆర్ కోసం డిమాండ్ చేయాలి కదా? ఉపాధ్యాయుల సమస్యల మీద ఐకాసా తరఫున ప్రశ్నించడం లేదు ఎందుకు? అంటూ యుటిఎఫ్, ఎస్టీయూ సభ్యులు శ్రీనివాసరావుపై ప్రశ్నలతో దాడి చేశారు.
బండి శ్రీనివాసరావు దీంతో వారి డిమాండ్లకు తలొగ్గి.. భవిష్యత్తులో ఐకాసాతో చర్చించకుండా ఎలాంటి ప్రకటన చేయబోనని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘జిపిఎస్ అమలు గురించి ప్రభుత్వానికి నేను ఎలాంటి మద్దతు తెలపలేదు. కాకపోతే సిపిఎస్ రద్దు మాకు రక్షణ అని చెప్పాను. అయితే కొన్ని పత్రికల్లో నేను జిపిఎస్ ను స్వాగతిస్తున్నట్లుగా తెలిపినట్లు రాశారు.
ఇందులో ఏ మాత్రం నిజం లేదు. ఇక 12వ పి.ఆర్.సి చైర్మన్ గా కూడా అందరికీ ఆమోదయోగ్యమైన అధికారినే నియమించాలని కోరాం’ అని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత.. సిపిఎస్ ను రద్దు చేయాల్సిందేనని ఓపిఎస్ కు ప్రత్యామ్నాయం లేదని ఐకాసా ప్రధాన కార్యదర్శి హృదయ రాజు అన్నారు. ఓపిఎస్ అమలు అయ్యేంతవరకు ఐకాసా కృషి చేయాల్సి ఉందని తెలిపారు. దీంతోపాటు మరో పదమూడు అంశాలపై కూడా తీర్మానాలు చేశారు. ఈ సమావేశంలో ఐకాసా డిప్యూటీ ప్రధాన కార్యదర్శి శివారెడ్డి, కో చైర్మన్లు తిమ్మన్న, కేఎస్ఎస్ ప్రసాద్ పాల్గొన్నారు.