
అమరావతి: ప్రముఖ సినీనటులు, టిడిపి వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్) కు భారతరత్న ఇవ్వాలని ఆయన తనయుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ డిమాండ్ చేశారు. ఆయనకు భారతరత్నతో సత్కరిస్తే వారిని వారు గౌరవించుకున్నట్లేనని అన్నారు.
ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఘనంగా నివాళి అర్పించారు బాలయ్య. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఎన్టీఆర్ పేదల పెన్నిది... ఆడపడుచులకు అన్న అన్నారు. ఎన్టీఆర్ రైతు కుటుంబంలో పుట్టి తెలుగువారి ఆరాధ్యదైవంగా ఎదిగారన్నారు. ఎన్నో అడ్డంకులు ఎదురైనా ఎన్టీఆర్ మహా నాయకుడిగా ఎదిగారని కొనియాడారు.
''పార్టీని స్థాపించిన 9 నెలలకే ఎన్టీఆర్ అధికారంలోకి తీసుకువచ్చారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని, ఉనికిని ఎన్టీఆర్ కాపాడారు. మహిళల కోసం పద్మావతి యూనివర్సిటీని స్థాపించారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, స్థానిక ఎన్నికల్లో 33శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఎన్టీఆర్ ది. ఎన్టీఆర్ ను ఆదర్శంగా తీసుకుని అనేక రాష్ట్రాల్లో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. రాయలసీమలో హంద్రీ- నీవా, గాలేరు-నగరికి ఎన్టీఆర్ రూపకల్పన చేశారు'' అని గుర్తుచేశారు.
read more ఈ `శ్రీరామదండకం`.. ఆ తారక రాముడికి అంకితంః బాలకృష్ణ
''ఎన్టీఆర్ బాటలోనే నడుస్తూ రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు ఏపీ అభివృద్ధికి కృషి చేశారు. కాబట్టి తెలుగుదేశాన్ని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి ఒక్కరు కృషిచేయాలి. పార్టీలోకి యువత రావాలి-వారిని నడిపించే అనుభవజ్ఞులు కావాలి'' అని అభిప్రాయపడ్డారు.
''ప్రతి ఒక్కరూ ఈ విపత్కర పరిస్థితుల్లో ఎన్టీఆర్ ను స్ఫూర్తిగా తీసుకుని సేవ చేయాలి. జగన్ రెడ్డి ప్రభుత్వం మాఫియాలకు అడ్డాగా మారింది. కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను'' అన్నారు నందమూరి బాలయ్య.