Badvel bypoll: బిజెపితో విభేదాలపై క్లారిటీ ఇచ్చిన నాదెండ్ల మనోహర్

By telugu teamFirst Published Oct 9, 2021, 11:33 AM IST
Highlights

ఏపీ బిజెపితో పొత్తుపై జనసేన సీనియర్ నాయకుడు నాదెండ్ల మనోహర్ స్పష్టత ఇచ్చారు. బద్వెలు ఉప ఎన్నిక నేపథ్యంలో బిజెపికి, జనసేనకు మధ్య విభేదాలు తలెత్తాయనే ప్రచారం నేపథ్యంలో ఆయన ఆ వివరణ ఇచ్చారు.

అమరావతి: బద్వెలు ఉప ఎన్నిక నేపథ్యంలో బిజెపితో విభేదాలు చోటు చేసుకున్నాయనే వార్తలపై జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ స్పష్టత ఇచ్చారు. తాము బిజెపితో కలిసే ఉన్నామని ఆయన చెప్పారు. బద్వెలులో బిజెపి అభ్యర్థి విజయానికి సహకరిస్తామని ఆయన చెప్పారు. వచ్చే రోజుల్లో బిజెపితో తమ జనసేన పొత్తు కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. 

పొత్తులో భాగంగా బిజెపి బద్వేలు సీటును జనసేనకు కేటాయించింది. బిజెపి రాష్ట్రాధ్యక్షుడు సోము వీర్రాజు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మధ్య చర్చలు జరిగిన తర్వాత బిజెపి ఆ విషయాన్ని తెలియజేసింది. అయితే, తాము పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు, పోటీ నుంచి విరమించుకుని వైసీపీ అభ్యర్థి దాసరి సుధ ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు సహకరిస్తామని పవన్ కల్యాణ్ ప్రకటించారు. 

See Video: Badvel Bypoll: బిజెపితో పవన్ కల్యాణ్ విభేదాలు

పవన్ కల్యాణ్ ఆ ప్రకటన చేసిన వెంటనే తెలుగుదేశం పార్టీ కూడా తాము పోటీ నుంచి విరమించుకున్నట్లు ప్రకటించింది. అప్పటికే రాజశేఖర్ ను తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పోటీ నుంచి విరమించుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే, జనసేన పోటీ నుంచి విరమించుకోవడం ఇష్టపడని బిజెపి బద్వెలులో తమ పార్టీ అభ్యర్థిని పోటీకి దించాలని నిర్ణయించి, అభ్యర్థిని కూడా ప్రకటించింది. 

Also Read: భిన్నాభిప్రాయాలు సహజం.. జనసేనతో మిత్రపక్షంగానే వుంటాం: సోము వీర్రాజు వ్యాఖ్యలు

ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ కు, బిజెపికి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయని, పవన్ కల్యాణ్ చంద్రబాబుకు దగ్గరవుతున్నారని ప్రచారం ముమ్మరమైంది. బిజెపి రాష్ట్ర నేతల తీరు పట్ల పవన్ కల్యాణ్ అసంతృప్తిగా ఉన్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటన చేశారు. జనసేనతో తమ పొత్తు కొనసాగుతుందని చెప్పారు.  

జనసేనకు, తమకు మధ్య ఉన్నవి భేదాభిప్రాయాలే తప్ప విబేదాలు కావని బిజెపి రాష్ట్రాధ్యక్షుడు సోము వీర్రాజు ఒకటికి రెండు సార్లు స్పష్టత ఇచ్చారు. బద్వెలు ప్రచారానికి పవన్ కల్యాణ్ ను ఆహ్వానిస్తామని కూడా ఆయన చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యే వెంకటసబ్బయ్య మరణంతో బద్వెలు శాసనసభ నియోజనకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతోంది. వెంకట సుబ్బయ్య సతీమణి దాసరి సుధకు వైసీపీ టికెట్ ఇచ్చింది. దీంతో సంప్రదాయం ప్రకారం దాసరి సుధపై పోటీకి దిగకూడదని జనసేన నిర్ణయించింది. ఈ నెల 30వ తేదీన బద్వెలు నియోజకవర్గానికి పోలింగ్ జరుగుతోంది. కాంగ్రెసు పార్టీ తన అభ్యర్థిగా కమలమ్మను బరిలోకి దింపింది. 

click me!