జేసీబీ- ఏసీబీ- పీసీబీ... రెండేళ్ల జగన్ పాలనపై అచ్చెన్నాయుడు సెటైర్లు

By Arun Kumar PFirst Published May 30, 2021, 2:26 PM IST
Highlights

జూన్ 26మొదలు ప్రతి శుక్రవారం రాత్రి సీఎం జగన్ ప్రతిపక్ష నేతల ఇళ్లు, వ్యాపార సంస్థలపైకి జేసీబీలను పంపిస్తూనే ఉన్నాడని అచ్చెన్నాయుడు ఆరోపించారు. 

అమరావతి: జగన్ రెండేళ్లపాలనకు జేసీబీ- ఏసీబీ-పీసీబీ అని టీడీపీ నామకరణం చేసిందంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. ఎవరైనా మంచి కార్యంతో పని ప్రారంభిస్తారు... కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ప్రజావేదిక కూల్చివేతతో పాలన ప్రారంభించాడని అన్నారు. రెండేళ్లక్రితం జూన్ 26 సాయంత్రం జేసీబీలతో ప్రజావేదికను కూల్చివేయించాడని... ఆనాటినుంచే ముఖ్యమంత్రి రాష్ట్ర విధ్వంసానికి శ్రీకారం చుట్టాడని అచ్చెన్న మండిపడ్డారు. 

''జూన్ 26మొదలు ప్రతి శుక్రవారం రాత్రి సీఎం జగన్ ప్రతిపక్ష నేతల ఇళ్లు, వ్యాపార సంస్థలపైకి జేసీబీలను పంపిస్తూనే ఉన్నాడు. ఆస్తులు ధ్వంసం చేయడమే పనిగా పెట్టుకున్నాడు కాబట్టే జేసీబీ అన్నాం. ప్రశ్నించేవారిపై ఏసీబీతో తప్పుడు కేసులు పెట్టిస్తున్నాడు కాబట్టి ఏసీబీ అన్నాం. అవి రెండూ కుదరనప్పుడు కొత్తగా పీసీబీ(పొల్యూషన్ కంట్రోల్ బోర్డు)ని వాడుతున్నాడు. అందుకే జగన్మోహన్ రెడ్డి రెండేళ్లపాలను జేసీబీ- ఏసీబీ- పీసీబీ పాలన అంటున్నాం'' అని తెలిపారు. 

''రెండేళ్లలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఏవిధంగా విధ్వంసం చేశాడో, ప్రజలను ఎలా మోసగించాడో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. తన పాలనలో ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ఏవిధంగా భ్రష్టుపట్టించాడో టీడీపీ విడుదలచేసిన బుక్ లెట్ లో వివరించాము. 94 అంశాలపై బుక్ లెట్ లో ముఖ్యమంత్రిని ప్రశ్నించాము. వాటిపై ఆయనగానీ, ఆయన మంత్రులుగానీ బహిరంగంగా సమాధానం చెప్పగలరా? ప్రజల సాక్షిగా, మీడియా సమక్షంలో చర్చకు తాముసిద్ధం. ప్రభుత్వం నుంచి ఎవరొస్తారో చెప్పాలి'' అని అచ్చెన్న సవాల్ విసిరారు. 

read more  వైసిపి పాలనపై బుక్ కాదు... గ్రంధాలు విడుదల చేయాలేమో?: మాజీ మంత్రి ఆలపాటి

''నవరత్నాల పేరుతో నకిలీ రత్నాలను ప్రజలకు అంటగట్టాడు. అమ్మ ఒడి, వాహన మిత్ర, రైతు భరోసా పేరుతో ప్రతి వర్గాన్ని నిలువునా మోసగించాడు. రెండేళ్లలో ప్రజలకు ఇచ్చింది రూపాయి అయితే, వారినుంచి రూ. 100 వసూలు చేశాడు. పింఛన్లు రూ.3వేలు పెంచుతానని చెప్పిన ముఖ్యమంత్రి రూ.250పెంచి, రూ.2250కు పరిమితం చేశాడు'' అన్నారు.

''ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వందలకొద్దీ హామీలిచ్చిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక తన మేనిఫెస్టోను సిగ్గుబిళ్లంత సైజుకి కుదించాడు. మంత్రులకు చంద్రబాబుని, టీడీపీని తిట్టడమే పని. వారి శాఖలకు సంబంధించి ఏం జరుగుతుందో వారికి పట్టదు'' అని విమర్శించారు. 

''ప్రత్యేకహోదాతో యువతకు ఉద్యోగాలొస్తాయని చెప్పి, విద్యార్థులను, యువతను రెచ్చగొట్టాడు. రెండేళ్లలో హోదాను ఏం చేశాడో, కేంద్రం మెడలు ఎందుకు వంచలేకపోయాడో సమాధానం చెప్పాలి.చంద్రబాబు నాయకత్వంలో ఎన్నిపరిశ్రమలు వచ్చాయో.. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఎన్ని వచ్చాయో అందరూ ఆలోచించాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఒప్పుకున్న ముఖ్యమంత్రి,  పీసీబీ సాయంతో జువారీ సిమెంట్స్, అమర్ రాజా వంటి సంస్థలను మూసేయించాడు. ముఖ్యమంత్రి ధనదాహాం కారణంగా రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రావడంలేదు'' అంటూ రాష్ట్ర పరిస్థితిపై అచ్చెన్న ఆందోళన వ్యక్తం చేశారు.
 

click me!