చంద్రబాబు-జగన్ మధ్య ఏకాభిప్రాయం

First Published Oct 4, 2017, 7:23 AM IST
Highlights

ముఖ్యమంత్రి చంద్రబాబానాయుడు, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విషయంలో అయినా ఉప్పు-నిప్పు అన్న సంగతి అందరికీ తెలిసిందే.

ముఖ్యమంత్రి చంద్రబాబానాయుడు, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విషయంలో అయినా ఉప్పు-నిప్పు అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇద్దరూ భిన్న ధృవాలే. జగన్ ను ముఖ్యమంత్రి మొదటి నుండి ఆజన్మ శతృవులాగే చూస్తున్నారు. అందుకే ఏ విషయంలోనూ అధికార-ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం సాధ్యం కావటం లేదు. అటువంటిది ఒక్క విషయంలో మాత్రం ఇద్దరిదీ ఒకే బాట అన్నట్లుంది.

ఇంతకీ ఆ ఒక్క విషయం ఏంటనుకుంటున్నారా? అదేనండి స్వామీజీలు, ముహూర్తాలు, జాతకాలు. ఒకపుడు చంద్రబాబుకు స్వామీజీలన్నా జాతకాలు, ముహూర్తాలు, వాస్తుశాస్త్రంపై పెద్దగా నమ్మకాలుండేవి కావు. అటువంటిది మూడోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఏ పనిచేయాలన్నా ముహూర్తాలు చూస్తున్నారు. వాస్తును కూడా బాగానే ఫాలోఅవుతున్నారు. సరే, ముహూర్తాలు, వాస్తు చూసుకున్నంత మాత్రాన అన్నీ బ్రహ్మాండమేనా అంటే అది వేరే విషయం.

ఇక, జగన్ విషయానికి వస్తే, ఎన్నికల ముందుగానీ తర్వాత గానీ ముహూర్తాలు, వాస్తును పెద్దగా పట్టించుకున్నట్లు కనబడలేదు. స్వామీజీలను కూడా పెద్దగా కలిసింది లేదు. క్రిస్తియన్ కదా ముహూర్తాలు, వాస్తుపై నమ్మకం లేదేమో జగన్ కు అనుకున్నారందరూ. తీరా చూస్తే ఏ కార్యక్రమానికైనా ఈమధ్య కాలంలో ముహూర్తాలు, వాస్తు చూసుకుంటున్నారు. తరచూ స్వామీజీలను కూడా కలుస్తున్నారు. మంగళవారం చిన్నజియ్యర్ ను కలవటం కూడా ఇందులో భాగమే.  అక్టోబర్ 27 నుండి మహా పాదయాత్ర చేద్దామని జగన్ అనుకున్నారు. అయితే, కేసుల విచారణ, కోర్టు ఆంక్షల నేపధ్యంలో సందిగ్దంలో పడింది. ఆ విషయం మీదే చిన్నజియ్యర్ ను కలిసారని ప్రచారం జరుగుతోంది. 

 

అదే విధంగా విజయవాడ ప్రాంతంలో కేంద్ర కార్యాలయంతో పాటు నివాసం ఏర్పాటు పనులు కూడా  అనుకున్నంత వేగంగా జరగటం లేదు. దాంతో ఒకటికి పదిసార్లు ముహూర్తాలు, వాస్తు చూపించుకుంటున్నారట. పాదయాత్రను కూడా శారధా పీఠాధిపతి స్వరూపానందేంద్ర  సరస్వతి సూచన మేరకే వాయిదా వేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న ఇంటిని కూడా వాస్తు పండితులకు చూపించినట్లు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావటంలో భాగంగా జగన్ కు సన్నిహితుడైన భూమన కరుణాకర్ రెడ్డి భారీ యాగాన్నే చేస్తున్నారు. సో, ఇవన్నీ చూసిన తర్వాత ఏమనిపిస్తోంది? పై ఇద్దరు అధినేతల మధ్య ఏ విషయంలో ఎన్ని అభిప్రాయ బేధాలలున్నా స్వామీజీలు, ముహూర్తాలు, వాస్తు విషయంలో మాత్రం ఏకాభిప్రాయంతోనే ఉన్నట్లు అర్ధం కావటం లేదు?

click me!