
ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలికి పట్టాభి రామాచార్యులు నూతన కార్యదర్శిగా నియమితులు కానున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. చార్యుల నియామకానికి సంబంధించిన ఫైల్ ప్రభుత్వ పెద్దల ఆమోదం పొంది ప్రస్తుతం ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ ఆమోదం కోసం నాలుగు రోజుల క్రితం రాజ్ భవన్ కు చేరుకున్నది. అంటే గవర్నర్ ఆమోదమే తరువాయి. పట్టాభి రామాచార్యులు ప్రస్తుతం రాజ్యసభ సచివాలయంలో అడిషినల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు.
కేంద్ర సర్వీసుల నుండి రానున్న పట్టాభి సాంకేతిక పరమైన అడ్డంకులను అధిగమించి రాష్ట్ర సర్వీసులోకి అడుగుపెడుతున్నారు. గతంలో కూడా శాసనసభ కార్యదర్శిగా వచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పట్లో సాధ్యం కాలేదు. అయితే, ఈసారి మాత్రం కాస్త గట్టిగా ప్రయత్నాలు చేసుకున్న పట్టాభికి ఇక్కడి పరిస్ధితులు కూడా సానుకూలమయ్యాయి.
రాష్ట్ర విభజన అయిన దగ్గర నుండి ఇన్చార్జ్ కార్యదర్శిగా పనిచేస్తున్న కె. సత్యనారాయణపై అనేక అవినీతి ఆరోపణలు వినబడుతున్నాయి. హౌసింగ్ సొసైటీలో ప్లాట్ల అమ్మకానికి సంబంధించిన ఒక కేసులో సత్యనారాయణ ప్రస్తుతం న్యాయస్ధానం చుట్టూ తిరుగుతున్నారు. దానికితోడు ఆయన సర్వీసు మొత్తం ఆది నుండి వివాదాస్పదమేనని కూడా సమాచారం.
సత్యనారాయణపై ఉన్న ఆరోపణలను సమగ్రంగా విచారించాలని వైసీపీ శాసనసభ్యుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి అనేక సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు, స్పీకర్ కోడెల శివప్రసాద్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రధాన కార్యదర్శి ఎస్ పి ఠక్కర్ తో పాటు గవర్నర్ కు కూడా ఫిర్యాదులు చేసినా ఉపయోగం కనబడలేదు. ప్రభుత్వంలోని కొందరు పెద్దలు ఉద్దేశ్యపూర్వకంగానే ప్రస్తుత కార్యదర్శిని కాపాడుతున్నట్లు కూడా ఆళ్ళ అనేకమార్లు బహిరంగంగానే ఆరోపణలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే.
ఎవరూ తన ఫిర్యాదులపై స్పందించకపోవటంతో చివరకు ఆళ్ళ న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. దాంతో న్యాయస్ధానం ఈ విషయమై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. దాంతో ప్రభుత్వం కూడా సత్యనారాయణను తప్పించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే ఎప్పటి నుండో పెండింగ్ లో ఉన్న పట్టాభి వైపు మొగ్గు చూపిన ప్రభుత్వం వెంటనే ఆయన నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో నవంబర్ మొదటివారంలో పట్టాభి రామాచార్యులు నూతన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.