విశాఖపట్నంలో వైసీపీ మంత్రులు, నాయకులపై రాళ్ల దాడి కేసులో అరెస్టయిన జనసేన నాయకులకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వీరిలో 61మందికి బెయిల్ రాగా, 9మందికి రిమాండ్ విధించింది.
విశాఖపట్నం : విశాఖ విమానాశ్రయం వద్ద ఏపీ మంత్రులపై దాడి ఘటనలో అరెస్టైన జనసేన నాయకులు, కార్యకర్తలకు న్యాయస్థానంలో ఊరట లభించింది. అరెస్టైన 61 మందిని రూ. పదివేల పూచీకత్తుపై కోర్టు వారిని విడుదల చేసింది. మరో తొమ్మిదిమందికి ఈ నెల 28 వరకు రిమాండ్ విధించింది. తొమ్మిది మందిపై 307 సెక్షన్ తొలగించి 326 సెక్షన్ గా మార్చి రిమాండ్ విధించారు. అంతకు ముందు హైడ్రామా మధ్య పోలీసులు జనసేన నేతలను ఏడో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు.
వారిని కోర్టుకు తీసుకు వచ్చే సమయంలో ప్రాంగణం అన్ని గేట్లు దిగ్బంధం చేశారు మరోవైపు 92 మంది జనసైనికులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు జనసేన లీగల్ సెల్ పేర్కొంది. అరెస్టు చేసిన వారిలో 9 మంది పార్టీ నేతలకు రిమాండ్ విధించారని, 61మంది జనసైనికులకు కోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు జనసేన తెలిపింది.
పోలీసుల ఆంక్షలు.. నోవాటెల్‌లోనే పవన్, మీడియా సమక్షంలో కార్యకర్తల కుటుంబాలకు ఆర్ధిక సాయం
ఇదిలా ఉండగా, విశాఖ విమానాశ్రయం వద్ద మంత్రులు, వైసీపీ నాయకులపై జరిగిన దాడి కేసులో జనసేన నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. జనసేన నాయకులను బాధ్యులను చేస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. కోన తాతారావు, పీతల మూర్తి యాదవ్, విశ్వక్ సేన్, సుందరపు విజయ్ కుమార్, పంచకర్ల సందీప్, శివప్రసాద్ రెడ్డి, పివిఎస్ఎన్ రాజు, శ్రీనివాస్ పట్నీయక్, కీర్తీస్, పాలవసల యశస్విని, గేదెల చైతన్య, పట్టిమ రాజును పోలీసులు అరెస్టు చేశారు.
విమానాశ్రయంలో సిసిటివి ఫుటేజీ ఆధారంగా దాడికి ప్రయత్నించిన వారిని గుర్తించి సెక్షన్ 307తో సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు ఓ ప్రకటనలో వెల్లడించారు. మంత్రి రోజా, తదితర వైసిపి నాయకులు విమానాశ్రయానికి వచ్చినప్పుడు పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు వారిని దూషించి, రాళ్లతోనూ, పార్టీ జెండా కర్రలతోనూ, పదునైన ఇనుప వస్తువులతోనూ దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. అక్కడ ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం కూడా జరిగిందని తెలిపారు.
ఇక, నోవాటెల్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బసచేసిన ఫ్లోర్లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. పవన్ బస చేసిన హోటల్ చుట్టూ పోలీసులు భారీగా మోహరించారు. ఏసిపి హర్షితచంద్ర నేతృత్వంలో హోటల్ చుట్టూ పోలీసులు పహారా కాస్తున్నారు. నోవాటెల్ వద్ద భద్రతను నగర పోలీస్ కమిషనర్ శ్రీకాంత్, క్రైమ్ డీసీపీ నాగన్న పరిశీలించారు. పవన్ కళ్యాణ్ తో పాటు నాదెండ్లమనోహర్, నాగబాబు నోవాటెల్ లో బస చేశారు. హోటల్ సమీపంలో 100 మీటర్ల పరిధిలో జనసంచారం లేకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. నోవాటెల్ వైపు వచ్చే అభిమానులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. పలు వాహనాలను పోలీసులు సీజ్ చేశారు.
ఇదిలా ఉండగా, విశాఖ విమానాశ్రయంలో వైసిపి నేతలపై జనసేన కార్యకర్తలు దాడి చేయడంపై టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి స్పందించారు. జనసేన కార్యకర్తలు అల్లరి మూకల్లా ప్రవర్తించారని ఆ పార్టీకి విధానమంటూ ఏం లేదని ఆయన మండిపడ్డారు. జనసేన కార్యకర్తల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. వైవి విశాఖ అభివృద్ధిని టిడిపి, జనసేన అడ్డుకుంటున్నాయని ఆరోపించారు.
అంతకుముందు మంత్రి జోగి రమేష్ కూడా ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. జనసేనది చిల్లర వ్యవహారమని, మాపై దాడి చేస్తే ఏం వస్తుందని జోగి రమేష్ ప్రశ్నించారు. అరాచకవాదులు అందర్నీ పవన్ చేరదీస్తున్నాడని ఆయన మండిపడ్డారు. మమ్మల్ని చూసి కవ్వించే కార్యక్రమాలకు జనసేన కార్యకర్తలు దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిరణ్ అనే తమ కార్యకర్తను చావబాదారు అని రక్తం కారుతున్నా వదల్లేదని జోగి రమేష్ అన్నారు. జనసేన కార్యకర్తలను పవన్ కళ్యాణ్ అదుపులో పెట్టుకోవాలని.. ఇలాంటి ఘటన మరోసారి జరిగితే ఊరుకునేది లేదని జోగి రమేష్ హెచ్చరించారు.