
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళకు సుప్రింకోర్టు శిక్ష విధించగానే మిగిలిన రాష్ట్రాల్లో కేసులెదుర్కొంటున్న నేతలపైన కూడా చర్చ మొదలైంది. కళంకిత నేతలు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు ఒక్క తమిళనాడులో మాత్రమే ఉన్నారా? అలా ఎందుకు, దేశమంతా ఉన్నారు. ఏపిలో వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపైన కూడా కేసులున్నాయి. ఉత్తరప్రదేశ్ లో మాజీ ముఖ్యమంత్రి మాయావతి, అమర్ సింగ్, బీహార్ లో లాలూ ప్రసాద్ యాదవ్, హర్యానాలో ఓం ప్రకాశ్ చౌతాలా, పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్, మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, ఢిల్లీ మాజీ సిఎం షీలా దీక్షిత్ తదితరులపైనా అవినీతి ఆరోపణలున్నాయి. వీరిలో కొందరిపై పాటు కేసులు కూడా దాఖలయ్యాయి.
పైన పేర్కొన్న రాష్ట్రాల్లోనే కాదు దేశంలోని పలు రాష్ట్రాల్లోని ఎందరో నేతలపై కేసులు దశాబ్దాల పాటు న్యాయస్ధానాల్లో మూలుగుతూనే ఉన్నాయి. చాలామందిపై కేసుల విచారణ ఏదో దశలో ఉన్నాయి. దాంతో వారంతా ప్రజాప్రతినిధులుగా చెలామణి అవుతునే నిరభ్యంతరంగా పదవులు అందుకుంటున్నారు. లాలూ ప్రసాద్, జగన్ లాంటి కొందరు నేతలు కొంతకాలం శిక్షనుభవించి బైలుపై బయట తిరుగుతున్నారు. అసలు తనపై దాఖలైన కేసులను విచారించేందుకే లేదంటూ చంద్రబాబు లాంటి నేతలు కోర్టుల్లో వాదిస్తున్న వారూ ఉన్నారు. కర్నాటకలో యడ్యూరప్ప, గాలి జనర్ధనరెడ్డి లాంటి వాళ్లు బైలుపై తిరుగుతున్నారు. విచారణ పూర్తై శిక్ష పడితే అపుడు వారికి కూడా శశికళ లాగే కారాగారం తప్పదేమో. ఏదేమైనా అందరూ నేర్చుకోవాల్సిన పాఠమేమిటంటే, అవినీతి కేసుల్లో న్యాయస్ధానం మెట్లెక్కిన వారికి ఎప్పటికైనా శిక్ష తప్పదని.