
అంతర్జాతీయ స్ధాయిలో పాల్గొనే అవకాశం వస్తే చంద్రబాబునాయుడు వదులుకుంటారా? ఛాన్సే లేదు. ఎందుకంటే, తనను తాను ప్రొజెక్ట్ చేసే ఏ చిన్ని అవకాశాన్నీ చంద్రబాబు వదులుకోరన్న విషయం అందరికీ తెలిసిందే. అటువంటిది బ్రిటన్ వేదికగా మూడు రోజుల అంతర్జాతీయ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని చంద్రబాబు వదులుకున్నారంటే అర్ధం ఏమిటి? తనకు మారుగా మున్సిపల్ మంత్రి నారాయణను ఎందుకు పంపుతున్నారు?
ఇంతకీ విషయమేమిటంటే, బ్రిటన్ వేదికగా ఈనెల 20 నుండి మూడు రోజుల పాటు ‘ఇంటర్నేషనల్ ట్రేడ్ సమ్మిట్’ జరుగుతోంది. పురాతన సంస్కృతి, శతాబ్దాల చరిత్ర కలిగిన ఓ ప్రాంతాన్ని వరల్డ్ క్లాస్ మాస్టర్ ప్లాన్, అత్యంత ఆధునిక టెక్నాలజీ సాయంతో అత్యాధునిక రాజధానిగా మారుస్తున్న వైనంపై అమరావతికి సంబంధించి ఓ ప్రజంటేషన్ కూడా ఉంది. అటువంటి అవకాశాన్ని చంద్రబాబు కాదనుకుని మంత్రిని పంపుతున్నారు. బంగారం లాంటి అవకాశాన్ని చంద్రబాబు వదులుకోవటంపై సర్వత్రా చర్చ మొదలైంది.
అధికారిక కార్యక్రమాల్లో తీరికలేని కారణంగానే చంద్రబాబు బ్రిటన్ వెళ్ళలేకపోతున్నట్లు సిఆర్డీఏ చెబుతోంది. అయితే, కొందరు అధికారులు మాత్రం వేరే రకంగా చెబుతున్నారు. బ్రిటన్ లో చంద్రబాబు ప్రజంటేషన్ ఇచ్చేందుకని సిఆర్డిఏ ఓ సిడిని రూపొందించి నిర్వాహకులకు పంపింది. అందులో గతంలో ప్రజంటేషన్లు ఇచ్చినట్లుగానే అద్భుతమైన గ్రాఫిక్లున్నాయి. అంతర్జాతీయ కన్సెల్టెంట్లతో ఒప్పందం కుదిరితే, పెట్టుబడులు వస్తే, మాస్టర్ ప్లాన్ తయారైతే అమరావతి ఈ విధంగా ఉంటుందంటూ ప్రభుత్వం ఊదరగొట్టిందట.
అయితే, సదరు ప్రజంటేషన్ను నిర్వాహకులు తిరస్కరించారని ప్రచారం జరుగుతోంది. తమకు గ్రాఫిక్లతో కూడిన భవిష్యత్ అభివృద్ధి వద్దని, ఇప్పటి వరకూ అమరావతిలో జరిగిన వాస్తవ అభివృద్ధిని మాత్రమే చెప్పాలని నిర్వాహకులు గట్టిగా చెప్పారట. దాంతో ఏమి చేయాలో ప్రభుత్వానికి అర్ధం కాలేదు. అమరావతి అన్నది ఇప్పటి వరకూ ఓ భావన మాత్రమే. కేవలం ఒకటికి మూడు సార్లు శంకుస్ధాపనలు మాత్రమే జరిగిందని చెప్పలేరు కదా? అధికారంలోకి వచ్చి రెండున్నరళ్లయినా ఇంతవరకూ మాస్టర్ ప్లానే సిద్ధం కాలేదని చెప్పలేరు కదా? మరి సదస్సులో అమరావతి గురించి ఏమని చెప్పాలి? అందుకే చంద్రబాబు తాను పాల్గొనకుండా నారాయణను పంపుతున్నారు. సదస్సుకు వెళ్ళాల్సిన అవసరం లేకపోయినా వెళుతున్నారా కాబట్టి నారాయణే ఏదో చెబుతారు, వచ్చేస్తారు లేండి.