
తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ సర్వీసులపై ఒకట్రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ కోరిన విధంగానే 1.05 లక్షల కిలోమీటర్లు తగ్గించుకున్నామని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు తెలిపారు.
అలాగే తెలంగాణ ప్రతిపాదించిన రూట్లలో కూడా ఏపీ బస్సులను తక్కువగా తిప్పేందుకు అంగీకరించామని ఆయన వెల్లడించారు. తెలంగాణ షరతులతో విజయవాడ- హైదరాబాద్ రూట్‌లో 350 బస్సులు తిరిగే అవకాశం వుండదని కృష్ణబాబు పేర్కొన్నారు.
నష్టమైనా ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అంగీకరించామని.. దీనివల్ల ఏడాదికి సుమారు రూ.265 కోట్ల ఆదాయాన్ని కోల్పోతామని ఆయన చెప్పారు.
Also Read:తెలుగు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు: ముగిసిన ఈడీల భేటీ, కుదరని ఏకాభిప్రాయం
ప్రతిపాదనలకు అంగీకరించాం కాబట్టి తెలంగాణ నుంచి గ్రీన్‌సిగ్నల్ వస్తుందని భావిస్తున్నట్లు ఎండీ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు ఎక్కువ ఛార్జీలు వేయకుండా నిఘా పెడతామని కృష్ణబాబు హెచ్చరించారు.
కాగా బస్సు సర్వీసులకు సంబంధించి రెండు రాష్ట్రాల ఆర్టీసీ ఈడీల మధ్య ఈ నెల మొదట్లో జరిగిన చర్చలు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిసిన సంగతి తెలిసిందే.
రెండు రాష్ట్రాలు చెరో లక్షా 61 వేల కిలోమీటర్లు బస్సులు నడిపాలనే ప్రతిపాదన వచ్చిందన్నారు టీఎస్ఆర్టీసీ ఈడీ యాదగిరి. మరోసారి భేటీ అయి తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. దీంతో దసరా పండుగ సీజన్‌లో తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులు ఉంటాయా, ఉండవా అని జనం ఆందోళన చెందుతున్నారు.
తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రోజుకు 1.60 లక్షల కిలోమీటర్ల మేర బస్సులు నడుపుతామని, ఏపీఎస్‌ఆర్టీసీ కూడా అన్ని కిలోమీటర్లకే పరిమితం కావాలని తెలంగాణ అధికారులు చెబుతున్నారు.