
Andhra Pradesh Tourism: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక రంగంలో 20% వృద్ధిని సాధించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం మేరకు ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.
సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన పర్యాటక రంగ సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం వార్షిక, త్రైమాసిక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించామని మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక ప్రదేశాల ప్రాముఖ్యతను బట్టి టూరిజం ఫెస్టివల్ క్యాలెండర్, నైట్ సఫారీ, డాల్ఫిన్ షోలు, 150 అరకు కాఫీ స్టాల్స్, ఎక్స్‌పీరియెన్స్ సెంటర్స్ ఏర్పాటుపై చర్యలు ప్రారంభించామన్నారు.
ప్రతి నెల పర్యాటక అభివృద్ధిపై నివేదికను సీఎంకు సమర్పిస్తామన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేల సూచనల మేరకు జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించి, సమగ్ర ప్రణాళికలపై డీపీఆర్‌లు రూపొందించనున్నట్లు తెలిపారు.
భవానీ ఐల్యాండ్, హోప్ ఐల్యాండ్ సహా అన్ని ద్వీపాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించామన్నారు. అరకు, గండికోట సహా ఆరు ప్రాంతాల్లో 180 టెంట్‌లతో టెంట్ సిటీస్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రాజమండ్రి, విజయవాడ, బెరంపార్క్, సూర్యలంకలలో హౌస్ బోట్స్‌ను త్వరలో అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు.
పర్యాటక రంగానికి చెందిన హోటళ్లు, రిసార్టులను అప్‌గ్రేడ్ చేయడమే కాకుండా కొత్త హోటళ్లను అభివృద్ధి చేయనున్నామని చెప్పారు. మేగా ఈవెంట్స్, జాతీయ, అంతర్జాతీయ ఫెయిర్స్ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రోప్‌వేలకు అనుకూలమైన ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపారు.
గిరిజన, వారసత్వ, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 500కి పైగా హోమ్ స్టేలను గుర్తించామన్నారు. దేవాలయాల్లో ఆధ్యాత్మిక పర్యాటక అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. కేంద్ర పథకాల ద్వారా వచ్చే నిధులతో పర్యాటక మౌలిక వసతుల అభివృద్ధి జరగనున్నట్లు తెలిపారు.