మిని మాల్ గా మారనున్న రేషన్ షాపులు

First Published Nov 18, 2016, 12:07 PM IST
Highlights

ఆంధ్రలో చౌకధరల దుకాణాలను రిటైల్ కిరాణా దుకాణాలుగా, మినీ సూపర్ మార్కెట్లుగా మార్చబోతున్నారు. 


ఆంధ్రప్రదేశ్ లో  అన్ని చౌకధరల దుకాణాలను రిటైల్ కిరాణా దుకాణాలుగా, మినీ సూపర్ మార్కెట్లుగా మార్చబోతున్నారు. ఈ మేరకు శుక్రవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పౌరసరఫరాల శాఖ అధికారులను అదేశించారు. సరుకులను రాష్ట్రమంతా  ఒకేధరకు విక్రయించాలని కూడా ఆయన చెప్పారు.

 

ఇప్పటి దాకా కేవలం రెండు మూడు రకాల సరుకులే ( బియ్యం,గోదుమలు, చక్కెర, కందిపప్పు ) సరఫరాకు పరిమితమయిన చౌకదుకాణాలు ముందు ముందు అన్ని నిత్యావసర సరుకులను అందించనున్నాయి.   సరుకులు  సమస్తం ఒకే చోట లభించాలని, నాణ్యత విషయంలో రాజీ పడొద్దని ముఖ్యమంత్రి  సూచనలిచ్చారు. డ్వాక్రా, మెప్మా ఉత్పత్తుల నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ వంటి కార్పొరేషన్ల సహకారంతో నడిచే సంస్థల ఉత్పత్తుల విక్రయానికి ఇక్కడ చోటు కల్పించాలని చెప్పారు. 


కొత్తగా రూపుమారే ఈ దుకాణాలలో అన్ని సరుకుల ధరలు రాష్ట్రమంతటా ఒకేలా వుండాలని ముఖ్యమంత్రి అన్నారు. విలేజ్ మాల్స్‌గా అభివృద్ధి చేసే ఈ దుకాణాల కోసం ప్రత్యేకంగా గోదాములు నిర్మించాలని పేర్కొన్నారు. సామాన్యుడి ఉత్పత్తులకు ఓ వేదిక కల్పించాలనేది తన ఆశయమని ఈ సందర్భంగా చెప్పారు.


ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేయ తలపెట్టిన ఎస్‌ఈజడ్‌లలో రిటైల్ కిరాణా దుకాణాలకు గోదాములు నిర్మిస్తారు. వీటి నిర్వహణను ఏపీ గిడ్డంగుల సంస్థ చేపట్టనుంది. ఇక్కడ నుంచి నియోజకవర్గంలోని అన్ని దుకాణాలకు వివిధ ఉత్పత్తులను తరలిస్తారు. అవసరమైతే డిమాండ్‌కు తగ్గట్టు ఇక్కడ నుంచే వివిధ రాష్ట్రాలకు, వివిధ దేశాలకు ఎగుమతులు చేసేలా గోదాములు నిర్మిస్తారు. 


సమీక్ష సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, పౌరసరఫరాల శాఖ కమిషనర్ రాజశేఖర్, సీఎంవో సంయుక్త కార్యదర్శి ప్రద్యుమ్న పాల్గొన్నారు

 

 

click me!