ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా...: సీఎం జగన్ పై అచ్చెన్న సెటైర్లు

By Arun Kumar PFirst Published Jul 27, 2021, 1:05 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఎన్నుకున్న సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేటర్లకు కూడా ఈ వైసిపి పాలనలో కనీస గౌరవం లేకుండా పోయిందని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.  

అమరావతి: రాష్ట్రంలో అధికార పార్టీ నేతల ఆగడాలకు, అరాచకాలకు అంతే లేకుండా పోతోందని టీడీపీ ఏపీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. కింద పడ్డా తమదే పైచేయి అన్నట్లు వ్యవహరిస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని, హక్కుల్ని కాలరాస్తున్నారన్నారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన అభ్యర్ధులు గెలిచిన చోట కూడా స్థానిక వైసీపీ నేతలు పెత్తనం చెలాయిస్తుండడం దారుణమని అచ్చెన్న అన్నారు. 

''సర్పంచులుగా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేటర్లుగా ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులకు కనీస గౌరవం ఇవ్వకపోవడం, అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానించకపోవడం రాజ్యాంగాన్ని అవమానించడమే. దేశానిక రాష్ట్రపతి ఎంతో గ్రామానికి సర్పంచ్ అంతే. అంతటి ప్రతిష్ట కలిగిన సర్పంచుల విషయంలో వైసీపీ నేతలు కక్షపూరితంగా వ్యవహరించడం దుర్మార్గం. ప్రోటోకాల్ పాటించకపోవడం ప్రజాస్వామ్య హక్కుల్ని హరించడమే'' అని మండిపడ్డారు. 

''అధికార పార్టీ నేతలు చేస్తున్న అరాచకాలను, అక్రమాలను ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టడం, నిలదీసిన వారి ఆస్తుల్ని ధ్వంసం చేయడం దారుణం. అధికారంలో ఎవరున్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన వారికి గౌరవం ఇవ్వాల్సిందే. అధికారులు వైసీపీ నాయకులు చెప్పినట్లు వ్యవహరిస్తూ.. ప్రోటోకాల్ పాటించకపోవడం క్షమించరాని నేరం. రాజ్యాంగ హక్కుల్ని కాలరాసి.. నియంతృత్వాన్ని విస్తరించేలా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి పెను ముప్పు. అధికార పార్టీ నేతలు చెప్పారనే కారణంతో అర్హులకు సంక్షేమ పథకాలు దూరం చేయడం, అనర్హులకు పథకాలు అందేలా చేయడం అత్యంత హేయం'' అన్నారు. 

read more  ఇక వైసిపితో క్షేత్రస్థాయి పోరాటం... సిద్దం కండి..: టిడిపి సీనియర్లతో చంద్రబాబు

''ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్లు ముఖ్యమంత్రి రాజ్యాంగ వ్యవస్థలపై చేస్తున్న దాడిని చూసి స్థానిక వైసీపీ నాయకత్వం అదే విధంగా వ్యవహరిస్తోంది. రాజ్యాంగ వ్యవస్థలపై దాడులకు తెగబడుతున్నారు. సర్పంచుల హక్కుల్ని కాలరాస్తున్నారు. ప్రజాతీర్పును అపహాస్యం చేస్తున్నారు'' అన్నారు. 

''ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన అభ్యర్ధుల విషయంలో అధికార పార్టీ నేతలు గౌరవప్రదంగా వ్యవహరించకుంటే ప్రజా కోర్టులో మొట్టికాయలు తప్పవు. ఇప్పటికే ముఖ్యమంత్రి తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలతో కోర్టులతో వరుసగా చీవాట్లు తింటున్నారు. వైసీపీ నేతలు కూడా జగన్ రెడ్డి మాదిరిగా వ్యవహరిస్తే కోర్టులతో చీవాట్లు తప్పవని గుర్తుంచుకోవాలి'' అని అచ్చెన్న హెచ్చరించారు. 

 

click me!