దళితులపై రేప్‌లు, దాడులు.. వాళ్లకు జగన్ లైసెన్స్ ఇచ్చారా: అచ్చెన్నాయుడు

By Siva KodatiFirst Published Jan 3, 2021, 4:00 PM IST
Highlights

టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అరెస్ట్‌పై ఏపీ తెలుగుదేశం అధ్యక్షుడు అచ్చెన్నాయుడు  మండిపడ్డారు. నెల రోజుల క్రితం ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో దళిత మహిళను అత్యాచారం చేసి కిరాతకంగా హత్య చేశారని ఆయన ఆరోపించారు. 

టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అరెస్ట్‌పై ఏపీ తెలుగుదేశం అధ్యక్షుడు అచ్చెన్నాయుడు  మండిపడ్డారు. నెల రోజుల క్రితం ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో దళిత మహిళను అత్యాచారం చేసి కిరాతకంగా హత్య చేశారని ఆయన ఆరోపించారు.

ఆ నిందితులను అరెస్టు చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని చలో పులివెందుల చేపట్టిన నేతలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం దారుణమన్నారు. తక్షణమే బీటెక్ రవిని విడుదల చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

అంతర్జాతీయ దొంగలకు బెయిలిచ్చి రోడ్ల మీద తిప్పుతున్నారు.. కానీ ప్రజా పోరాటం చేసిన వారిపై కేసులు పెట్టి జైళ్లో పెడతారా? అని అచ్చెన్న విమర్శించారు. రాష్ట్రంలో గూండా గిరి రాజ్యమేలుతోందని... రాక్షస  సంస్కృతి ఎగిసి పడుతోందని ఆయన ఎద్దేవా చేశారు.

అధికారం శాశ్వతం కాదన్న విషయం గుర్తుంచుకుంటే మంచిదన్న అచ్చెన్నాయుడు.. వీటికి మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. జగన్ రెడ్డి ప్రభుత్వ తీరు నిందుతులకు రాజమార్గం పట్టేలా ఉందని... దేశంలో ఎక్కడాలేనంతగా అట్రాసిటీని నిర్వీర్యం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

చేతనైతే నిందితులకు శిక్ష వేసి, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని అచ్చెన్నాయుడు సూచించారు. చట్టాలను మట్టు పెడుతున్న వైసీపీ ప్రభుత్వ చర్యలు రాజ్యాంగ సంక్షోభానికి నిదర్శనమన్నారు.

ఇష్టానుసారంగా దళితులపై అత్యాచారాలు, దాడులు చేయండి.. మీకు మేము రక్షణగా ఉంటామని కిరాయి మూకలకు జగన్ భరోసా ఇస్తున్నారా అని అచ్చెన్నాయుడు సెటైర్లు వేశారు.

దేశం మొత్తంలో జరిగే అరాచకాలన్నీ.. మన రాష్ట్రంలో జరుగుతున్నాయన్నారు. దళిత, ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం టీడీపీ నిరంతరం పోరాటం చేస్తుందని అచ్చెన్న స్పష్టం చేశారు. కూల్చివేతలు, కక్షసాధింపులు, అణచివేతలు ,దాడులు చేయడం, అక్రమ కేసులు బనాయించడం మామూలైపోయిందన్నారు.

జగన్ పాలనలో అరాచకం వికృత రూపం దాల్చి, ఏ నియంత పాలనలోనూ కనిపించని దౌర్జన్య కాండ, నిర్భందం రాష్ట్రంలో కొనసాగుతోందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. 
 

click me!