అశోక్ గజపతిరాజుపై కక్షసాధింపు... వైసిపి గూండాలను రంగంలోకి దింపిన జగన్..: అచ్చెన్నాయుడు

By Arun Kumar P  |  First Published Dec 22, 2021, 2:30 PM IST

రామతీర్థం ఆలయ పునర్ నిర్మాణ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త అశోక్ జగపతి రాజును వైసిపి గుండాల చేత సీఎం జగన్ అవమానించారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.  


విజయనగరం జిల్లా రామతీర్థం (ramatheertham temple)లోని కోదండ రామస్వామి ఆలయం  పునర్ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం అధికార వైసిపి (ycp), ప్రతిపక్ష టిడిపి (tdp) మధ్య మరో వివాదాన్ని రాజేసింది. ఆలయ పునర్మిరాణ శంకుస్థాపనపై ధర్మకర్తల మండలితో చర్చించకుండా, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా జరపడంపై అనువంశిక ధర్మకర్త, మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్‌గజపతి రాజు (Ashok Gajapathi Raju) ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ క్రమంలో ఇవాళ (బుధవారం) జరుగుతున్న ఆలయ శంకుస్థాపన కార్యక్రమంలో అశోక్ గజపతి రాజు ఆందోళనకు దిగారు.  పునర్నిర్మాణ, శంకుస్థాపన ఫలకాలు ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శిలఫలకాలను తోసేశారు. ఈ క్రమంలోనే అధికారులు, అశోక్‌గజపతిరాజుకు మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. 

Latest Videos

ఈ ఘటనపై ఏపీ టిడిపి అధ్యక్షులు అచ్చెన్నాయుడు (kinjarapu atchannaidu) స్పందించారు. రామతీర్థం ఆలయ శంకుస్థాపన కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరించారన్నారు. శంకుస్థాపన బోర్డుపై ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు పేరు లేకపోవడం సంస్కృతి, సంప్రదాయాలను కాలరాయడమేనని అన్నారు. దీనిపై ప్రశ్నించిన అశోక్ గజపతిరాజును వైసీపీ గూండాలు తోసివేయడం దుర్మార్గమని అచ్చెన్న మండిపడ్డారు. 

read more  విజయనగరం రామతీర్థం కొండపై ఉద్రిక్తత.. ఆందోళ‌న‌కు దిగిన అశోక్ గ‌జ‌ప‌తిరాజు

''విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థంలోని బోడికొండ కోదండ రామాలయం పునర్ నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త అశోక్ గజపతిరాజును ప్రభుత్వం అవమానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. శంకుస్థాపనపై ధర్మకర్తల మండలితో చర్చించకపోవడం జగన్ రెడ్డి కక్షసాధింపు చర్యలకు నిదర్శనం'' అని అచ్చెన్న పేర్కొన్నారు. 

''రాష్ట్రం మొత్తంలో మాదిరిగానే దేవాలయాల వద్ద కూడా వైసీపీ తమ వికృత రూపాన్ని ప్రదర్శిస్తోంది. చట్టాన్ని, రాజ్యాంగాన్ని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఉల్లంఘించారు'' అని అచ్చెన్నాయుడు ఆరోపించారు. 

'' రాష్ట్రంలో రెండున్నరేళ్ల జగన్ రెడ్డి పాలనలో 200కు పైగా హిందూ దేవాలయాలపై దాడులు, విగ్రహ ధ్వంసం ఘటనలు జరిగాయి. ఏ ఘటనలోనూ దోషులను పట్టుకోలేదు. బోడికొండలోని కోదండరాముని విగ్రహం ధ్వంసం ఘటన జరిగి ఏడాది గడుస్తున్నా ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు?'' అని నిలదీసారు. 

read more  నా తల్లిని కించపర్చినవారిని వదలను: నారా లోకేష్ వార్నింగ్

''విజయవాడ దుర్గగుడిలో మూడు వెండి సింహాలు మాయమైనా, అంతర్వేదిలో రథం దగ్ధమైనా జగన్ రెడ్డి పాలనలో చర్యలు శూన్యం. రామతీర్థం ఆలయాన్ని ఏడాదిలో పూర్తిచేస్తామని చెప్పి మాట తప్పారు. దేవాదాయశాఖ మంత్రి బూతుల పురాణం, అవినీతిలో తేలియాడుతున్నారు. ప్రోటోకాల్ పాటించకుండా అశోక్ గజపతిరాజును అవమానించిన దేవాదాయశాఖ మంత్రి వెల్లింపల్లి శ్రీనివాస్ బహిరంగ క్షమాపణ చెప్పాలి'' అని అచ్చెన్నాయుడు డిమాండ్ చేసారు.

బోడికొండపై కోదండ రాముని ఆలయ పునర్నిర్మాణానికి నేడు శంకుస్థాపన జరిగింది. ఆలయ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ (botsa satyanarayana), వెల్లంపల్లి శ్రీనివాస్ (vellampalli srinivas) పాల్గొన్నారు. అయితే మంత్రుల రాకకు ముందే అధికారులు, ధర్మకర్త అశోక్ గజపతిరాజుకు మధ్య తోపులాట జరిగింది. 
 


 

click me!