కృష్ణా నీటి వాటాపై గట్టి జవాబివ్వాలి:తెలంగాణ వాదనలో పసలేదన్న ఏపీ రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం

By narsimha lodeFirst Published Aug 1, 2021, 2:33 PM IST
Highlights

కృష్ణా నది నీటిపై తెలంగాణ వాదనలో పస లేదని ఏపీ రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం అభిప్రాయపడింది. తెలంగాణ వాదనకు గట్టిగా సమాధానం చెప్పాలని ప్రభుత్వం ఆ సంఘం నేత విశ్వేశ్వరరావు కోరారు.


అమరావతి:కృష్ణానది నీటిలో సగం వాటాను ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న వాదనలో పస లేదని నవ్యాంధ్ర రిటైర్డ్ ఇంజనీరింగ్ అధికారుల సంఘం అభిప్రాయపడింది. నదీ పరీవాహక ప్రాంతంకాని రాయలసీమకు కృష్ణా జలాలను ఇచ్చేందుకు కృష్ణా జలవివాద ట్రైబ్యునల్‌ అంగీకరించదని తెలంగాణ వాదిస్తోంది.పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా సీమకు నీళ్లు వదిలేందుకు వీల్లేదని తెలంగాణ అభ్యంతరం చెబుతోంది. కృష్ణాజలాల్లో సగం వాటా తెలంగాణకు దక్కుతుందంటూ కృష్ణానదీ యాజమాన్య సంస్థకు తెలంగాణ నీటిపారుదలశాఖ ఇచ్చిన సమాచారంలో వాస్తవంలేదని నవ్యాంధ్ర రిటైర్డ్‌ ఇంజనీరింగ్‌ అధికారుల సంఘం అభిప్రాయపడింది.

తెలంగాణ లేవనెత్తిన అభ్యంతరాలన్నీ తప్పులేనని, ఈ వాదనలో పసలేదని ఆ సంఘం అధ్యక్షుడు ఎం.విశ్వేశ్వరరావు చెప్పారు.కొత్త ట్రైబ్యునల్‌ ఆదేశాలు వచ్చేంత వరకూ కృష్ణాజలాల్లో 50 శాతం కోటాను ఇవ్వాల్సిందేనని తెలంగాణ కోరడం అర్థరహితమన్నారు. కృష్ణానదీ జల వివాద ట్రైబ్యునల్‌-2 రాజోలిబండ కుడి కాలువకు 4టీఎంసీలను కేటాయించడంతో సహా పనులు ముందుకు తీసుకువెళ్లవచ్చని సూచించడాన్ని గుర్తుచేశారు.

 సాధారణ ప్రవాహంలో తెలుగుగంగకు పోతిరెడ్డి హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా 25 టీఎంసీలను కేటాయించిందని గుర్తు చేశారు. 2015 జూన్‌ 18, 19 తేదీల్లో కేంద్ర జలశక్తిశాఖ కార్యదర్శి కార్యాలయంలో ఇరురాష్ట్రాల జలవనరుల మంత్రుల సమక్షంలో ఇరు రాష్ట్రాల కార్యదర్శులు ఒప్పందం చేసుకున్నారని ఆయన గుర్తు చేశారు. కేఆర్‌ఎంబీకి తెలంగాణ నీటి పారుదల శాఖ ఇచ్చిన ఫిర్యాదుపై రాష్ట్ర ప్రభుత్వం గట్టి సమాధానం ఇవ్వాలని కోరారు.


 

click me!