తమ్ముడు నిరసన, అన్నయ్య ప్రశంసలు: జగన్ నిర్ణయంపై మెగాస్టార్ హర్షం

By Nagaraju penumalaFirst Published Dec 12, 2019, 10:35 AM IST
Highlights

తక్షణ న్యాయం కంటే సత్వర న్యాయం మరింత సత్ఫలితాల్ని ఇస్తాయన్న నమ్మకం ప్రజలందరిలో ఏర్పడిందన్నారు. అందుకే అలాంటి సత్వర న్యాయం కోసం ఆంధ్రప్రదేశ్ లో తొలి అడుగులు పడడం హర్షణీయమన్నారు మెగాస్టార్ చిరంజీవి. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని నిరసిస్తూ తమ్ముడు నిరసన దీక్షకు దిగితే అన్నయ్య మాత్రం ప్రశంసలతో ముంచెత్తారు. రైతులకు భరోసా ఇవ్వాలంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ కాకినాడలో నిరసన దీక్షకు దిగితే ఏపీ దిశా చట్టం అభినందనీయమంటూ సోదరుడు మెగాస్టార్ చిరంజీవి ప్రశంసించారు. 

మహిళల భద్రతపై ఏపీ సీఎం తీసుకువచ్చిన కొత్త చట్టం ఏపీ దిశా చట్టం చేయడం మంచి పరిణామమన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆంధ్రప్రదేశ్ దిశా చట్టం- 2019 పేరుతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమని కొనియాడారు. 

ప్రియాంక హత్య: మృగాల మధ్య బతుకుతున్నాం.. అమ్మాయిలకు చిరంజీవి రిక్వస్ట్!..

ముఖ్యంగా మహిళా సోదరీమణులకు, లైంగిక వేధింపులకు గురవుతున్న చిన్నారులకు ఈ చట్టం భరోసా, భద్రత ఇస్తుందన్న ఆశ తనలో ఉందని మెగాస్టార్ అభిప్రాయపడ్డారు. దిశ సంఘటన దేశంలోని ప్రతీ ఒక్కర్నీ కలచివేసిందని మెగాస్టార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఎమోషన్స్ తక్షణ న్యాయాన్ని డిమాండ్ చేశాయని గుర్తు చేశారు. 

తక్షణ న్యాయం కంటే సత్వర న్యాయం మరింత సత్ఫలితాల్ని ఇస్తాయన్న నమ్మకం ప్రజలందరిలో ఏర్పడిందన్నారు. అందుకే అలాంటి సత్వర న్యాయం కోసం ఆంధ్రప్రదేశ్ లో తొలి అడుగులు పడడం హర్షణీయమన్నారు మెగాస్టార్ చిరంజీవి. 

చిరంజీవితో భేటీ: పవన్ కల్యాణ్ కు వైఎస్ జగన్ చెక్...

సీఆర్పీసీని సవరించడం ద్వారా 4 నెలలు అంతకంటే ఎక్కువ పట్టే విచారణ సమయాన్ని 21 రోజులకు కుదించడం, ప్రత్యేక కోర్టులు ఇతర మౌళిక సదుపాయాల్ని కల్పించడంతో పాటు ఐపీసీ ద్వారా సోషల్ మీడియా ద్వారా మహిళల గౌరవాన్ని కించపరచడం లాంటివి చేస్తే తీవ్రమైన శిక్షలు, చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడితే జీవిత ఖైదు విధించడం మంచి పరిణామమన్నారు. 

ఇలాంటి కఠిన శిక్షల ద్వారా నేరాలోచనలో ఉన్న వాళ్లలో భయం కల్పించే విధంగా చట్టాలు తేవడాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు తెలిపారు. ఈ చర్యలతో మహిళా లోకం నిర్భయంగా, స్వేచ్ఛగా ఉండగలుగుతుందన్న నమ్మకం తనకు  ఉందని మెగాస్టార్ చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు.  

ఇకపోతే బుధవారం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన మంత్రి వర్గ సమావేశంలో మహిళల భద్రతపై పై చర్చ జరిగింది. అందులో భాగంగా మహిళలపై దాడులకు అత్యాచారాలకు పాల్పడిన వారికి, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడిన వారికి ఉరి శిక్ష వేసేలా రూపొందించిన ఏపీ దిశా చట్టం డ్రాప్ట్ ను కేబినెట్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. 

కాకినాడలో పవన్ కళ్యాణ్ రైతు సౌభాగ్య దీక్ష ప్రారంభం...

click me!