సామాన్యులకు సినిమాను అందుబాటులోకి తీసుకు రావాలనే ఉద్దేశ్యంతోనే టికెట్ల ధరలను తగ్గించినట్టుగా ఏపీ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. హీరో నాని చేసిన వ్యాఖ్యలకు మంత్రి కౌంటరిచ్చారు.
అమరావతి: సామాన్యులకు సినిమా అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతోనే తమ ప్రభుత్వం టికెట్ల ధరలను తగ్గించిందని ఏపీ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.తెలుగు సినీ హీరో Cinema Tickets ధరల తగ్గింపుపై చేసిన వ్యాఖ్యలకు మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. సినిమా థియేటర్ల కంటే థియేటర్ పక్కన ఉండే కిరాణ దుకాణానికి ఎక్కువ కలెక్షన్లు బెటర్ అంటూ ఏపీ ప్రభుత్వంపై Nani కామెంట్స్ చేశారు.ఈ వ్యాఖ్యలపై మంత్రి Botsa Satyanarayana స్పందించారు.
టికెట్ ధరలు తగ్గించి ప్రేక్షకులను అవమానించారని హీరో నాని చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన మాట్లాడారు. ప్రేక్షకులను ఎందుకు అవమానిస్తామని ఆయన ప్రశ్నించారు. టికెట్ ధరల విషయమై ఏమైనా ఇబ్బంది ఉంటే జిల్లా అధికారులను ఆశ్రయించాలని మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. తమకు ఇబ్బందులున్నాయని చెబితే ప్రభుత్వం అప్పుడు ఆలోచిస్తుందని ఆయన చెప్పారు. సినిమా టికెట్ ధరలు తగ్గించాలని తమ ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
also read:సినిమా టికెట్ రేట్లపై.. జీఓ 35ను రద్దు సవాల్ పిటీషన్ విచారణ జనవరి 4కు వాయిదా..
మార్కెట్ లో ఏదైనా కొంటే దానికి ఎమ్మార్పీ ఉంటుంది కదా అని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. సినిమా టికెట్ల ధరలను నియంత్రిస్తే అవమానించడమా అని ఆయన ప్రశ్నించారు. మేమింతే, ఎంత అంటే అంత వసూలు చేస్తామంటే కుదరదని మంత్రి బొత్స సత్యనారాయణ తేల్చి చెప్పారు. సినిమా టికెట్ల ధరల తగ్గింపుపై ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయంపై తమకు లాభ నష్టాలపై ప్రభుత్వంతో చర్చించాలని ఆయన సినీ పరిశ్రమకు సూచించారు. కానీ ఇష్టారీతిలో టికెట్ల ధరలను పెంచుకొని విక్రయించుకొనేందుకు తాము సమ్మతించబోమని ఆయన తేల్చి చెప్పారు.సినిమా టికెట్ల ధరలను విపరీతంగా పెంచుకొనే వీలు కల్పిస్తే ఒత్తిళ్లు లేనట్టు, ధరలు తగ్గిస్తే ఒత్తిళ్లు ఉన్నట్టా అని మంత్రి ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలను తగ్గిస్తూ 35 నెంబర్ జీవోను ఇటీవల జారీ చేసింది. అయితే ఈ జీవోను సవాల్ చేస్తూ కొందరు థియేటర్ల యజమానులు హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు . అయితే ప్రభుత్వం తీసుకొచ్చిన 35 నెంబర్ జీవోను ఈ నెల 14న రద్దు చేసింది.పాత విధానంలోనే టికెట్ల రేట్లుంటాయని ప్రకటించింది. అయితే ఈ తీర్పుపై ఏపీ ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. అయితే సినిమా టికెట్ల ధరల తగ్గింపుపై జాయింట్ కలెక్టర్లు నిర్ణయం తీసుకొంటారని ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ నెల 16న ఆదేశించింది. అయితే కోర్టును ఆశ్రయించిన థియేటర్ల యజమానులకు మినహా రాష్ట్రం మొత్తం 35 నెంబర్ జీవో అమల్లో ఉందని ఏపీ ప్రభుత్వం అదే రోజున ప్రకటించింది.