నిన్న శ్రీకాకుళంలో జరిగిన సభలో పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలకు ఏపీ మంత్రి అప్పలరాజు కౌంటరిచ్చారు.
అమరావతి: ఈ జన్మకు పవన్ కళ్యాణ్ సీఎం కాలేడని ఏపీ మంత్రి అప్పలరాజు చెప్పారు. అమ్ముడుపోవడమే పవన్ కళ్యాణ్ నైజమన్నారు. అందుకే ఆయన సీఎం కాలేడన్నారు.మీరు తనను గెలిపిస్తారని చెబితే ఒంటరిగా పోటీ చేస్తానని నిన్న సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను మంత్రి గుర్తు చేశారు. అందుకే వీర మరణం అవసరమా అంటూ వ్యాఖ్యలు చేశారని మంత్రి అభిప్రాయపడ్డారు. నిన్న శ్రీకాకుళం సభలో పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలకు మంత్రి అప్పలరాజు కౌంటరిచ్చారు. శుక్రవారం నాడు తాడేపల్లిలో మంత్రి అప్పలరాజు మీడియాతో మాట్లాడారు.
ఇటీవల చంద్రబాబును కలిసిన సమయంలోనే కొంత అడ్వాన్స్ ను పవన్ కళ్యాణ్ తీసుకున్నాడని ఆయన ఆరోపించారు. ఇక రానున్న రోజుల్లో టీడీపీతో కలిసి వెళ్దామని పవన్ కళ్యాణ్ చెబుతారన్నారు. వీరమరణం అంటూ పవన్ కళ్యాణ్ దయనీయమైన మాటలు మాట్లాడుతున్నారని ఏపీ మంత్రి అప్పలరాజు ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ మాటలు చూస్తే పగటి వేషగాళ్లు గుర్తుకు వస్తున్నాయని మంత్రి చెప్పారు.
undefined
కార్యకర్తల్లో స్పూర్తి నింపేలా మాట్లాడాలి కానీ ప్యాకేజీ మాటలు మాట్లాడవద్దని మంత్రి అప్పలరాజు పవన్ కళ్యాణ్ కు హితవు పలికారు. జనసేన కార్యకర్తల కష్టాన్నిచంద్రబాబుకు పవన్ కళ్యాణ్ తాకట్టు పెడుతున్నారని మంత్రి ఆరోపించారు. సీఎం జగన్ సింహం లాంటివాడన్నారు. పవన్ కళ్యాణ్ లాంటి గ్రామ సింహనికి జగన్ భయపడరని మంత్రి చెప్పారు. మొరిగే కుక్కలు జగన్ వెంట్రుక కూడా పీకలేరన్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల గురించి కూడా మంత్రి అప్పల రాజు కౌంటరిచ్చారు. ఆనాడు వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో గుడ్డలూడదీసీ కొట్టాలని కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల గురించి మంత్రి మాట్లాడారు. రెండు చోట్ల పోటీ చేసినా కూడ ప్రజలు ఓడించి పవన్ కళ్యాణ్ గుడ్డలూడదీశారన్నారు. అసెంబ్లీ గేటు దాటకుండా పవన్ కళ్యాణ్ గుడ్డలూడదీశారన్నారు.
వైఎస్ జగన్ ప్రభుత్వంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు తానను సిద్దమని మంత్రి అప్పలరాజు చెప్పారు. ఈ విషయమై చర్చకు సిద్దమా అని పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు. మత్య్సకారుల గురించి పవన్ కళ్యాణ్ కు అవగాహన ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపై 2014-19 మధ్య పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదో చెప్పాలని అప్పలరాజు ప్రశ్నించారు. ప్యాకేజీ కోసం చంద్రబాబు ఏది చెబితే అది మాట్లాడడం పవన్ కళ్యాణ్ కు అలవాటుగా మారిందని ఆయన విమర్శించారు.
also read:రోజా రెండుసార్లు గెలిచింది, పైగా మంత్రి.. నువ్వేం పొడిచావ్ : పవన్‌కు పేర్నినాని చురకలు
చంద్రబాబు కుట్రలో భాగంగానే శ్రీకాకుళంలో నిన్న పవన్ కళ్యాణ్ సభ నిర్వహించారన్నారు. ఈ సభలో టీడీపీ ఆఫీస్ నుండి వచ్చిన స్క్రిప్ట్ నే పవన్ కళ్యాణ్ చదివి విన్పించారని మంత్రి అప్పలరాజు చెప్పారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఫిషింగ్ హర్బర్లను నిర్మిస్తుందని మంత్రి చెప్పారు. చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో ఒక్క ఫిషింగ్ హర్భర్ ను నిర్మించారా అని మంత్రి అప్పలరాజు పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు.