
వసతి కొరత కారణంగా అమరావతిలో ఇపుడు జరుగనున్న శాసనసభ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు అమరావతి అలవెన్స్ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని ఆర్థక, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి యనమల్ల రామకృష్ణుడు వెల్లడించారు.
ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు 50 వేల రూపాయిల అలవెన్సును అదనంగా చెల్లిస్తామని ఆయన చెప్పారు.
శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ తో కలసి యనమల నూతనంగా నిర్మించిన ఏపీ శాసనసభ భవనాన్ని ఈ రోజు సందర్శించారు. లాబీలు, మంత్రుల ఛేంబర్స్, అసెంబ్లీలో సీటింగ్, సౌండ్ సిస్టమ్ ఏర్పాట్లను వారు పరిశీలించారు. అలాగే పార్కింగ్, మీడియా పాయింట్ నిర్మాణ పనులను కూడావారిరువురు పరిశీలించారు. విఐపిలు, సభ్యులు, మీడియా, సందర్శకుల రాకపోకల ఏర్పాట్ల గురించి అధికారులు స్పీకర్ కు మంత్రికి వివరించారు.
శాసనసభ సమావేశాలు మార్చి 6వ తేదీనుంచి ప్రారంభమవుతున్నాయి. మార్చి 13వ తేదీన సాధారణ బడ్జెట్‌ను, ఆ తరువాత వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెడతున్నట్లు అసెంబ్లీ సందర్శన అనంతరం విలేకరులకు యనమల చెప్పారు.
ఉగాదిలోగా బడ్జెట్‌ను ఆమోదింపజేసుకుని సభను వాయిదా వేయాలని భావిస్తున్నామని చెబుతూ ఈ అంశాన్ని మార్చి 6న బిఎసిలో నిర్ణయిస్తామనియనమల చెప్పారు. శాసనసభ ప్రాంగణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారని ఆయన అభిప్రాయపడ్డారు.