
చంద్రబాబునాయుడు అంటించిన మకిలిని కడుక్కోమని స్పీకర్ కోడెల శివప్రసాద్ కు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి బహిరంగ లేఖలో విజ్ఞప్తి చేసారు. అమరావతిలో నిర్మంచిన కొత్త అసెంబ్లీ భవనంలో ప్రారంభమవుతున్న శాసనసభ సమావేశాల్లోనైనా ఫిరాయింపు ఎంఎల్ఏలపై వేటు వేయాలని కోరారు. హైదరాబాద్ లో నామినేటెడ్ ఎంఎల్ఏ స్టీఫెన్సన్ ఓటును దొంగతనం చేయబోయి తప్పించుకువచ్చేసారని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. రెండోసారి వందల కోట్ల రూపాయలతో తమ పార్టీ ఎంఎల్ఏలను దొంగతనం చేసినట్లు చెప్పారు. ఆ 21 మంది ఎంఎల్ఏలపై అనర్హత వేటు వేయాలని చెప్పినా ఇంత వరకూ పట్టించుకోలేదని జగన్ స్పీకర్ కు గుర్తుచేసారు. దొంగసొత్తుతో కొత్త అసెంబ్లీ భవనంలో ప్రవేశించవద్దని స్పీకర్ కు జగన్ హితవు చెప్పారు.
ప్రజల తీర్పుకు స్పీకర్ విలువ ఇవ్వాలని, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలంటూ స్పీకర్ను జగన్ విజ్ఞప్తి చేసారు. ఇప్పటికైనా ఆ ఎంఎల్ఏలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేసారు. హైదరాబాద్ లో దొంగతనం చేస్తూ దొరికినందువల్లే అమరావతిలో అసెంబ్లీ నిర్మాణ ప్రక్రియ వేగతంతమైందని జగన్ అభిప్రాయపడ్డారు. కొత్త రాజధానిలో కొత్త సభకు మకిలి అంటకుండా వుండాలంటే వెంటనే సదరు ఎంఎల్ఏలపై అనర్హత వేటు వేయాలంటూ డిమాండ్ చేస్తూనే చంద్రబాబు అంటించిన మకిలిని స్పీకర్ కడుక్కోవాలంటూ సూచించారు.