
ఏపీ సీఎం జగన్‌తో (ys jagan) నిన్న ఉద్యోగ సంఘాల భేటీ కావడం, ఆపై ముఖ్యమంత్రి ఫిట్ మెంట్ ప్రకటించడం తెలిసిందే. ఈ క్రమంలో ఉద్యోగ సంఘాల నేతలు శనివారం సీఎంవో అధికారులతో సమావేశమయ్యారు. భేటీ ముగిసిన అనంతరం వారు మీడియాకు వివరాలు తెలియజేశారు. నిన్న సీఎం ప్రధాన అంశాలు చర్చించారని, మిగిలిన అంశాలను అధికారులతో చర్చించాలని కోరడంతో తాము ఇవాళ సమావేశమయ్యామని వివరించారు.
ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు (ap jac amaravathi) బొప్పరాజు వెంకటేశ్వర్లు (bopparaju venkateswarlu) మాట్లాడుతూ, హెచ్ఆర్ఏపై ఇప్పుడున్న స్లాబులను ఉంచాలని, లేకపోతే పీఆర్సీ కమిషనర్ ప్రతిపాదించిన కొత్త స్లాబులైనా అమలు చేయాలని కోరినట్లు చెప్పారు. అయితే హెచ్ఆర్ఏపై 8, 24, 16 స్లాబులను మాత్రం ఆమోదించవద్దని అధికారులకు స్పష్టం చేసినట్టు బొప్పరాజు వెల్లడించారు. హెచ్ఆర్ఏ అంశంలో కిందిస్థాయి ఉద్యోగుల నుంచి వస్తున్న ఒత్తిళ్లను వారికి వివరించినట్లు తెలిపారు.
ఫిట్ మెంట్‌తో పాటు అదనపు పెన్షన్, హెచ్ఆర్ఏ తదితర అంశాలపై అధికారులకు స్పష్టంగా వివరించామని బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు. ముఖ్యంగా, అదనపు పింఛను 80 ఏళ్ల నుంచి ఇవ్వాలని సీఎస్ కమిటీ సిఫారసును ఆమోదించవద్దని, ప్రస్తుతం ఉన్న పింఛను విధానాన్నే కొనసాగించాలని కోరినట్టు బొప్పరాజు తెలిపారు.
అదనపు పెన్షన్‌పై సీఎస్ కమిటీ సిఫారసులు అమలు చేస్తే పెన్షనర్లు ఇబ్బందిపడతారన్న అంశాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లామని ఆయన చెప్పారు. సీఎం ప్రకటించగా మిగిలిన అంశాలు కూడా త్వరలోనే పరిష్కారం అవుతాయని వెంకటేశ్వర్లు ఆకాంక్షించారు. ఇక ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంచడంపైనా ఆయన హర్షం వ్యక్తం చేశారు. అలాగే త్వరలో ఉద్యోగుల సొంతింటి కలను నెరవేరుస్తామని సీఎం చెప్పడం కూడా తమకు సంతోషాన్ని కలిగించిందని బొప్పరాజు అన్నారు.
కాగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీ 23.25 శాతం ఫిట్‌మెంట్ ను ఇవ్వనున్నట్టుగా ప్రకటించింది. ఉద్యోగ సంఘాలతో శుక్రవారం నాడు సీఎం జగన్ సమావేశమయ్యారు.ఈ సమావేశంలో 23.29 శాతం ఫిట్‌మెంట్ ఇస్తామని జగన్ ప్రకటించారు. ఈ సమావేశానికి ముందే ఏపీ సీఎం జగన్ ఆర్ధిక శాఖాధికారులతో సమావేశమయ్యారు.ఈ సమావేశం ముగిసిన తర్వాత ఉద్యోగ సంఘాల నేతలను చర్చలకు పిలిచారు.
నిన్ననే ఉద్యోగ సంఘాల నేతలతో జగన్ చర్చించారు. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాలు తమ అభిప్రాయాలను సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలు చెప్పిన అభిప్రాయాలను సీఎం నోట్ చేసుకొన్నారు. ఇవాళ మరోసారి ఉద్యోగ సంఘాల నేతలను పిలిపించి Prc ఫిట్‌మెంట్ 23.29 శాతం ఇస్తున్నట్టుగా ప్రకటించారు. ఏపీలో ఉద్యోగుల Retirement వయస్సు 60 నుండి 62 శాతానికి పెంచుతామని సీఎం జగన్ హామీ ఇచ్చారు.
ఈ ఏడాది జూన్ 30 లోపుగా కారుణ్య నియామకాలను చేపడుతామని సీఎం హామీ ఇచ్చారు. పెంచిన జీతాలను ఈ నెల నుండి అమల్లోకి వస్తాయని సీఎం హామీ ఇచ్చారు.2020 ఏప్రిల్ నుండి మానిటరీ బెనిఫిట్ అమలు చేస్తామని కూడా సీఎం ఉద్యోగ సంఘాల నేతలకు హామీ ఇచ్చారు.ఈహెచ్ఎస్ సమస్యల పరిష్కారానికి సీఎస్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేస్తామని కూడా సీఎం జగన్ చెప్పారు. రెండు వారాల్లో employees సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని జగన్ స్పష్టం చేశారు.