Vaikunta Dwara Darshan: ఈ నెల 10 నుంచి వైకుంఠ ద్వార సర్వదర్శన టోకెన్లు.. కేవలం వారికే మాత్రమే..

By Sumanth KanukulaFirst Published Jan 8, 2022, 4:43 PM IST
Highlights

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని గతేడాది మాదిరిగానే ఈ సారి కూడా 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం (vaikunta dwara darshan) అందించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నెల 13 నుంచి 22 వరకు భక్తులకు తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కల్పించనుంది.

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని గతేడాది మాదిరిగానే ఈ సారి కూడా 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం (vaikunta dwara darshan) అందించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నెల 13 నుంచి 22 వరకు భక్తులకు తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కల్పించనుంది. ఈ క్రమంలోనే ఈ నెల 10వ తేదీ నుంచి వైకుంఠ ద్వార సర్వదర్శన టికెట్లను జారీ చేయునన్నట్టుగా టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. కరోనా దృష్ట్యా తిరుపతి వాసులకే వైకుంఠ ద్వార సర్వదర్శన టోకెన్లను జారీ చేయనున్నట్టుగా చెప్పారు. ఇందుకోసం తిరుపతిలో 5 చోట్ల సర్వదర్శన టోకెన్ల జారీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు. రోజుకు 5 వేల మంది వైకుంఠ ద్వారా దర్శనం చేసుకునే అవకాశం కల్పించనున్నారు. 

ధర్మారెడ్డి శనివారం తిరుపతిలో ఏర్పాటు చేసిన టోకెన్ జారీ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైకుంఠ ద్వార దర్శనం కోసం జనవరి 10న ఉదయం 9 గంటల నుంచి తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్టుగా తెలిపారు. తిరుపతిలోని రామచంద్ర పుష్కరిణి, ముత్యాలరెడ్డిపల్లె, బైరాగి పట్టెడ రామానాయుడు పాఠశాల, సత్యనారాయణపురం జిల్లా పరిషత్ పాఠశాల, మున్సిపల్ కార్యాలయంలో టోకెన్లు జారీకి కౌంటర్‌లు ఏర్పాటు చేసినట్టుగా చెప్పారు. 

కేవలం తిరుపతి స్థానికులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనానికి టోకెన్లు జారీ చేయనున్నట్టుగా తెలిపారు. ఈ నెల 13 నుంచి 22 వరకు రోజుకు 5 వేల చొప్పున మొత్తం 50 వేల సర్వదర్శనం టికెట్లు జారీ చేయనున్నట్టుగా చెప్పారు. భక్తులు క్యూ లైన్లలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు పొందిన భక్తులను.. దర్శనానికి ముందు రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి అలిపిరి మార్గం నుంచి tirumalaకు అనుమతిస్తామని చెప్పారు. 

ఇక, ప్రతి ఏడాది వైకుంఠ ఏకాదశి రోజు తిరుమల శ్రీవారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకోడానికి  లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారంలో శ్రీవారిని  దర్శించుకునేందుకు చాలా మంది భక్తులు ఆసక్తి చూపిస్తారు. ఏకాదశి, ద్వాదశి ఈ రెండు రోజులే వైకుంఠ ద్వారం తెరిచి ఉండటం వల్ల ఎక్కువ మందికి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవ‌డానికి అవ‌కాశం ల‌భించ‌డం లేదు. ఈ క్రమంలోనే గతేడాది 10 రోజులు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈసారి కూడా అదే విధానాన్ని ఫాలో అవుతున్నారు. ఇక, సామాన్యులకు ఎక్కువ సంఖ్యలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో జనవరి 13 నుంచి 22వ తేదీ వరకు వీఐపీల సిఫారసు లేఖలను టీటీడీ రద్దు చేసింది. 

click me!