ఈసీకి నిధులు ఆపేసిన ప్రభుత్వం... రమేశ్ పిటిషన్: తీర్పు రిజర్వ్

Siva Kodati |  
Published : Oct 22, 2020, 07:08 PM IST
ఈసీకి నిధులు ఆపేసిన ప్రభుత్వం... రమేశ్ పిటిషన్: తీర్పు రిజర్వ్

సారాంశం

రాష్ట్ర ప్రభుత్వం తమకు ఎన్నికల నిధులను ఇవ్వడం లేదంటూ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ రమేశ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం తమకు ఎన్నికల నిధులను ఇవ్వడం లేదంటూ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ రమేశ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. ఆ పిటిషన్‌పై గురువారం విచారణ జరిపిన కోర్టు ఇరువర్గాల వాదనలు విన్న అనంతరం తీర్పును రిజర్వ్ చేసింది. గత విచారణలో రాజ్యాంగ సంస్థలకు సహాయ సహకారాలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. 

కాగా, ఎన్నికల కమిషన్ నిర్వహణకు ఖర్చయ్యే నిధులను ప్రభుత్వం మంజూరు చేయకుండా నిలిపి వేసిందని నిమ్మగడ్డ రమేష్ ఆరోపించారు. ఎన్నికల సంఘం నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు రాక ఇబ్బందులు పడుతున్నట్లు ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించడం లేదని రమేష్ కుమార్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

దీనిపై జోక్యం చేసుకుని వెంటనే నిధులు విడుదలయ్యేలా చూడాలని హైకోర్టును నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోరారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 (కే) ప్రకారం ఎన్నికల కమిషన్‌కు నిధులు ఆపేయడం చట్ట విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.

వెంటనే నిధులు విడుదల చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని రాష్ట్ర అత్యున్నత ధర్మాసనాన్ని ఎన్నికల కమిషనర్ కోరారు. ఈ పిటిషన్‌లో ప్రతివాదులుగా ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీలను పేర్కొన్నారు. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తరఫున సీతారామమూర్తి, అశ్వినీకుమార్‌ వాదనలు వినిపించారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!