అమరావతి రైతుల పాదయాత్ర పిటిషన్‌లపై హైకోర్టు తీర్పు.. ఏం చెప్పిందంటే..

By Sumanth KanukulaFirst Published Nov 1, 2022, 3:18 PM IST
Highlights

అమరావతి రైతుల పాదయాత్రకు సంబంధించి దాఖలైన పిటిషన్‌లపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నేడు తీర్పు వెలువరించింది. అమరావతి రైతుల పాదయాత్రపై గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలకే కట్టుబడి ఉండాలని తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

అమరావతి రైతుల పాదయాత్రకు సంబంధించి దాఖలైన పిటిషన్‌లపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నేడు తీర్పు వెలువరించింది. అమరావతి రైతుల పాదయాత్రపై గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలకే కట్టుబడి ఉండాలని తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 600 మంది రైతులు పాదయాత్రలో పాల్గొనవచ్చని హైకోర్టు తెలిపింది. ఐడీ కార్డులు ఉన్నవారే పాదయాత్రలో పాల్గొనాలని ఆదేశించారు. రైతులకు ఐడీ కార్డులు వెంటనే ఇవ్వాలని పోలీసులకు కోర్టు సూచించింది. రైతులు పాదయాత్రను ప్రారంభించుకోవచ్చని తెలిపింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరించేది లేదని స్పష్టం చేసింది. రైతుల పాదయాత్రకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించేలా డీజీపీని అనమతించాలని రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. 

అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు ఇదివరకే తిరుపతికి పాదయాత్ర నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే రెండో విడత పాదయాత్రను శ్రీకాకుళం జిల్లాలోని అరసవెల్లికి చేపట్టారు. ఈ యాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో.. కోర్టు నుంచి షరతులతో కూడిని అనుమతిని పొందింది. 600 మంది రైతులు మాత్రమే పాదయాత్రలో పాల్గొనాలని కోర్టు స్పష్టం చేసింది. అలాగే సంఘీభావం తెలిపే వాళ్లు రోడ్డుకు ఇరువైపుల ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. 

Latest Videos

అయితే అమరావతి రైతుల పాదయాత్ర 41వ రోజు కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో నిలిచిపోయింది. పోలీసుల తీరుతో తాము పాదయాత్రకు విరామం ప్రకటించినట్టుగా రైతులు తెలిపారు. ఈ క్రమంలోనే తమ పాదయాత్రపై పోలీసులు విధించిన కొన్ని ఆంక్షలను సడలించాలని అమరావతి పరిరక్షణ సమితి హైకోర్టును ఆశ్రయించింది. 

అదే సమయంలో రైతుల పాదయాత్రను నిలిపివేసేందుకు అనుమతివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పర్మిషన్ ఆర్డర్‌లో పేర్కొన్న షరతులను పాటించడంలో రైతులు విఫలమైనందున.. పాదయాత్ర కొనసాగించడం వల్ల ప్రజా శాంతి దెబ్బతింటుందని, శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలుగుతుందని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అఫిడవిట్‌లో పేర్కొన్నారు. బయటి వ్యక్తులతో పాటు పాదయాత్రలో పాల్గొనేవారి క్రమరహిత ప్రవర్తన రాజకీయ వ్యక్తీకరణలను పొందిందని, వారి ఉద్రేకపూరిత ప్రసంగాలు శత్రుత్వ వాతావరణాన్ని సృష్టించాయని చెప్పారు. పిటిషనర్ల చర్యలు హైకోర్టు ఆదేశాలను స్పష్టంగా ఉల్లంఘిస్తున్నాయని.. పాదయాత్ర చేయడానికి వారికి ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని కోరారు. 

ఈ క్రమంలోనే రెండు పిటిషన్లపై వాదనలు జరిగాయి. విచారణ సందర్భంగా అమరావతి రైతుల తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పాదయాత్రలో 600 మంది పాల్గొంటారని, ఎవరైనా మధ్యలో విరమించుకుంటే ఇతరులను అనుమతించాలని కోరారు. మధ్యలో వచ్చే వారి వివరాలను పోలీసులకు అందజేస్తామని తెలిపారు. సానుభూతిపరులు కవాతుకు ముందు, వెనుక ఉండేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు.

మరోవైపు రైతులు హైకోర్టు నిబంధనలను పాటించడం లేదని ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదించారు. గుర్తింపు కార్డులు చూపించాలని మాత్రమే పోలీసులు అడిగారని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. తాజాగా నేడు తీర్పును వెలువరించింది. 

click me!