అమరావతి అసైన్డ్ భూముల కొనుగోళ్ల కేసు.. మాజీ మంత్రి నారాయణకు మూడు నెలల ముందస్తు బెయిల్..

By Sumanth KanukulaFirst Published Sep 14, 2022, 4:35 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారాయణకు భారీ ఊరట లభించింది. అమరావతి అసైన్డ్ భూముల కేసులో నారాయణకు కోర్టు మూడు నెలల ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారాయణకు భారీ ఊరట లభించింది. అమరావతి అసైన్డ్ భూముల కేసులో నారాయణకు కోర్టు మూడు నెలల ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో నారాయణకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరఫు న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు హైకోర్టులో వాదనలు వినిపించారు. నారాయణ ఆరోగ్య పరిస్థితి బాగోలేదని కోర్టుకు తెలిపారు. ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. కింది కోర్టు మిగతా నిందితులకు సెక్షన్లు వర్తించివని,  రిమాండ్‌ను తిరస్కరించినట్లు తెలిపారు. 

అయితే ప్రభుత్వం తరఫు వాదనలు వినిపించిన న్యాయవాది.. కేసులో నారాయణ కీలక నిందితుడని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ కేసులో బెయిల్ ఇవ్వొద్దని కోరారు.  అయితే ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. నారాయణకు మూడు నెలల ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. 

ఇక, అమరావతి అసైన్డ్ భూముల కొనుగోలుకు సంబంధించి మాజీ మంత్రి నారాయణకు సహచరులుగా భావిస్తున్న ఐదుగురిని సీఐడీ మంగళవారం అరెస్టు చేసింది. రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న విజయవాడకు చెందిన కొల్లి శివరాం, గట్టెం వెంకటేష్, విశాఖపట్నం‌కు చెందిన చిక్కాల విజయ సారధి, బడే ఆంజనేయులు, కొట్టి కృష్ణ దొరబాబులను అరెస్టు చేసినట్లు సీఐడీ అధికారిక ప్రకటనలో తెలిపింది. అరెస్టు చేసిన వారిని సీఐడీ.. ప్రత్యేక కోర్టు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు.

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం పెదపాలెం గ్రామానికి చెందిన యలమర్తి ప్రసాద్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు సీఐడీ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఈ కేసులో సీఐడీ అధకారులు నారాయణను ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. నిందితులు ఎస్సీలకు ద్రోహం చేశారని, వారి అసైన్డ్ భూముల‌ను త‌క్కువ ధ‌ర‌కు రాజ‌ధాని రాక‌ముందే కొనుగోలు చేశారని ప్రసాద్ కుమార్ ఆరోపించారు. అప్పుడు మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ మంత్రిగా ఉన్న నారాయణ ఆదేశాల మేరకు నిందితులు ల్యాండ్‌ పూలింగ్‌పై ఎస్సీల్లో భయాందోళనలు సృష్టించారని ఫిర్యాదులో ఆరోపించారు. 

ఇక, అమరావతిలో 1,100 ఎకరాల అసైన్డ్‌ భూముల్లో అక్రమ లావాదేవీలు చోటుచేసుకున్నాయని సీఐడీ తెలిపింది. 169.27 ఎకరాల ఎసైన్డ్‌ భూములకు సంబంధించి నారాయణ, ఆయన కుటుంబసభ్యులు, రామకృష్ణ హౌసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మధ్య రూ.15 కోట్ల ఆర్థిక లావాదేవీలు నడిచినట్లు దర్యాప్తులో గుర్తించినట్టుగా పేర్కొంది. 

click me!