ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకే అమరావతి రైతుల పాదయాత్ర: ఏపీ మంత్రి అంబటి

By narsimha lode  |  First Published Sep 14, 2022, 4:08 PM IST

ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్నారని ఏపీ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు.చంద్రబాబు అసెంబ్లీకి వచ్చి చర్చల్లో పాల్గొనాలని ఆయన కోరారు. 


అమరావతి: ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకే అమరావతి రైతులు పాదయాత్ర నిర్వహిస్తున్నారని ఏపీ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు.బుధవారం నాడు అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. అభివృద్ది వికేంద్రీకరణే తమ విధానమని ఆయన చెప్పారు. అందుకే మూడు రాజధానుల అంశాన్ని తెరమీదికి తెచ్చినట్టుగా  మంత్రి వివరించారు. రాష్ట్రం మొత్తం అభివృద్ది చెందాలనే ఉద్దేశ్యం తమ ప్రభుత్వానిదని  రాంబాబు చెప్పారు. ఇందులో తప్పేం ఉందని ఆయన అడిగారు.

అమరావతి రైతుల పాదయాత్రలో ఒక్క రైతు ఉన్నాడా అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. అమరావతి పేరుతో టీడీపీ చీఫ్ చంద్రబాబు పెద్ద కుంభకోణానికి తెర తీశాడని ఆయన ఆరోపించారు.దొంగలు, దోపీడీదారులు వెంకటేశ్వరస్వామిని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. పోలవరంపై చర్చిద్దామంటే అసెంబ్లీకి వచ్చేందుకు చంద్రబాబు వెనుకాడుతున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ దెబ్బతినడానికి చంద్రబాబు సర్కార్ తీసుకున్న నిర్ణయాలే  కారణమని  మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి గల కారణాలపై చర్చించేందుకు అసెంబ్లీకి రావాలని అంబటి రాంబాబు చంద్రబాబును కోరారు.  అసెంబ్లీకి రానని చంద్రబాబు దొంగ శపథాలు చేశారన్నారు. ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాకే అసెంబ్లీకి వస్తానని ప్రకటించిన చంద్రబాబు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

Latest Videos

undefined

అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ అమరావతి పరిరక్షణ సమితి జేఏపీ ప్రారంభించిన ఆందోళనలు వెయ్యి రోజులు పూర్తి చేసుకున్నాయి. దీంతో ఈ నెల 12 వ తేదీ నుండి అమరావతి పరిరక్షణ సమితి ఆద్వర్యంలో అమరావతి నుండి అరసవెల్లికి  పాదయాత్రను ప్రారంభించారు. ఏపీ హైకోర్టు ఈ పాదయాత్రకు అనుమతిని ఇచ్చింది. సుమారు వెయ్యి కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించనున్నారు. పాదయాత్ర ముగింపును పురస్కరించుకొని సభను కూడా ఏర్పాటు చేయాలని అమరావతి జేఏసీ భావించింది.  ఇదిలా ఉంటే మూడు రాజధానులకు సంబంధించిన అంశంపై రేపటి నుండి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని అధికార పార్టీ భావిస్తుంది. 

చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో అమరావతిని రాజధానిగా ప్రకటించారు. అయితే జగన్ సర్కార్ మూడు రాజధానుల అంశాన్ని తెరమీదికి తెచ్చింది. మూడు రాజధానులపై ఈ ఏడాది మార్చిలో ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో మూడు రాజధానుల రద్దు బిల్లును ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. న్యాయపరమైన సమస్యలు ఎదురుకాకుండా ఉండేలా కొత్త బిల్లును ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. 


 

click me!