రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. తొలి రోజే మూడు రాజధానులపై చర్చ..?

By Sumanth KanukulaFirst Published Sep 14, 2022, 3:50 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు రేపటి (సెప్టెంబర్ 15) నుంచి ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాల తొలి రోజే ప్రభుత్వం మూడు రాజధానులపై శాసనసభలో స్వల్పకాలిక చర్చను పెట్టే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు రేపటి (సెప్టెంబర్ 15) నుంచి ప్రారంభం కానున్నాయి. ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. రేపు ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాల తొలి రోజే ప్రభుత్వం మూడు రాజధానులపై శాసనసభలో స్వల్పకాలిక చర్చను పెట్టే అవకాశం ఉంది. అధికార వికేంద్రీకరణను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్న ప్రభుత్వం.. ఆ దిశగా అసెంబ్లీ సమావేశాలను వినియోగించుకోవాలని చూస్తోంది. 

మూడు రాజధానులపై సభలో సీఎం జగన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ విధంగా మూడు రాజధానులతో ప్రయోజనాలు ఉన్నాయనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఆలోచనలో జగన్ ఉన్నారు. మరోవైపు ఈ సమావేశాల్లో ప్రభుత్వం.. అధికార వికేంద్రీకరణ, మూడు రాజధానులపై కొత్త బిల్లును ప్రవేశపెట్టనుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేకపోయినప్పటికీ.. ప్రభుత్వం వైపు నుంచి అలాంటి సంకేతాలు వెలువడుతున్నాయి. 

రాజధాని స్థానాన్ని మార్చే శాసనాధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఈ ఏడాది మార్చిలో ఏపీ హైకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అలాగే అమరావతిలో పెండింగ్‌లో ఉన్న అన్ని పనులను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ తర్వాత అసెంబ్లీ.. ఏపీసీఆర్‌డీఏ రద్దు చట్టం- 2020, ఏపీ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి చట్టం- 2020 లను రద్దు చేసింది. 

అయితే జగన్ సర్కార్ మాత్రం మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది.  విశాఖపట్నం (పరిపాలన రాజధాని), అమరావతి (శాసన రాజధాని), కర్నూలు (న్యాయ రాజధాని)..  మూడు రాజధానులకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం జగన్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముగింపు సందర్భంగా చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వం రూ. 1.09 లక్షల కోట్ల భారీ వ్యయంతో 53,000 ఎకరాలను అభివృద్ధి చేయాలనే బృహత్తర ప్రణాళికను రూపొందించిందని.. అయితే ఈ ప్రక్రియ అంతా అవినీతి, బంధుప్రీతితో కూడుకున్నదని జగన్ ఆరోపించారు. 

ఇక, గత కొద్దిరోజులుగా ఏపీ మంత్రులు.. మూడు రాజధానుల అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. మరోవైపు రాజధాని ప్రాంత రైతులు అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా అరసవల్లికి సోమవారం పాదయాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే రైతుల పాదయాత్రపై పలువురు మంత్రులు విమర్శలు గుప్పిస్తున్నారు. అది టీడీపీ చేయిస్తున్న దండయాత్ర అంటూ ఆరోపణలు  గుప్పిస్తున్నారు. మూడు రాజధానులపై లోపాలు లేకుండా సమగ్రంగా తయారుచేసిన బిల్లును తీసుకోస్తామని చెబుతున్నారు. తాజాగా మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ.. మూడు రాజధానుల అంశాన్ని ప్రజాభిప్రాయంగా తీసుకొని 2024 ఎన్నికలకు వెళ్లనున్నట్లు  చెప్పారు. 

click me!