జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌లలో ఫ్లాట్లు .. ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

Siva Kodati | Published : Mar 22, 2023 2:29 PM
Google News Follow Us

సారాంశం

రాష్ట్ర ప్రభుత్వం డెవలప్‌ చేసిన జగనన్న స్మార్ట్‌ టౌన్ షిప్ ప్రాజెక్ట్‌లకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వెసులుబాటు కల్పించింది జగన్ సర్కార్. ఉద్యోగులు తమకు నచ్చిన చోట.. కోరుకున్న చోట ఫ్లాట్ తీసుకోవచ్చని స్పష్టం చేసింది

ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం డెవలప్‌ చేసిన జగనన్న స్మార్ట్‌ టౌన్ షిప్ ప్రాజెక్ట్‌లకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వెసులుబాటు కల్పించింది. ఉద్యోగులు తమకు నచ్చిన చోట.. కోరుకున్న చోట ఫ్లాట్ తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు పురపాలక .. పట్టణాభివృద్ధి శాఖ నిబంధనలు సడలించింది. ఈ మేరకు బుధవారం జీవో నెంబర్ 38 జారీ చేసింది. గతంలో ఈ స్మార్ట్ టౌన్‌షిప్‌లలో ఫ్లాట్లు తీసుకోవాలంటే ప్రభుత్వ ఉద్యోగులపై ఆంక్షలు వుండేవి.. ఈ నేపథ్యంలో ఇలాంటి వారందరికి ఊరట కలిగినట్లయ్యింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 22 నగరాలు, పట్టణాల్లో ప్రభుత్వం జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. వీటిలో ఉద్యోగుల కోసం 10 ఫ్లాట్లు రిజర్వ్ చేయడంతో పాటు ఇరవై శాతం డిస్కౌంట్ కూడా ఇస్తోంది. 

ఇదిలావుండగా.. రాజధాని అమరావతి ప్రాంతంలో వైఎస్ జగన్ సర్కార్ మరోసారి అలజడి సృష్టించింది. రైతుల అభిప్రాయాన్ని పరిగణనలోనికి తీసుకోకుండా రాజధానిలో ఆర్ 5 జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు.. తుళ్లూరు మండలంలోని మందడం, ఐనవోలు గ్రామాల పరిధిలోని 900 ఎకరాలను ఆర్ 5 జోన్ పరిధిలోకి తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం. 

కాగా..  అమరావతిలో ఇతర ప్రాంతాల పేదలకు ఇళ్ల స్థలాలను ఉద్దేశించిన దస్త్రానికి అప్పటి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. పేదలకు స్థలాలు ఇచ్చే సీఆర్‌డీఏ, ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చట్టాల సవరణకు గవర్నర్ అంగీకారం తెలిపారు. గతేడాది ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ఈ చట్టాలకు జగన్ ప్రభుత్వం సవరణలు ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.