
ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని తలచుకుంటే ఎవరైనా సరే కళ్ళు తిరిగి పడి పోవాల్సిందే. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే వారు ఖచ్చితంగా పోలవరం, పట్టిసీమ లాంటి ప్రాజెక్టులు చేస్తున్న లేక ఒకపుడు చేసిన బడా కాంట్రాక్టర్లే అయ్యుండాలి. లేదా రియలఎస్టేట్ వ్యాపారంలో ఒకే స్ధలాన్ని పదిమందికి రిజిస్ట్రేషన్ల చేసేంత మొనగాళ్ళైనా అయ్యుండాలి. ఇదేమీ కాదంటే మాత్రం ఖచ్చితంగా టిడిపి అభ్యర్ధే అయ్యుండాలి. లేకపోతే ఖర్చుకు తట్టుకోలేక మిడిల్ డ్రాప్ అవ్వటం ఖాయం.
పరిస్ధితి చూస్తుంటే కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సగటున రూ. 150 కోట్లు వ్యయం చేయక తప్పదేమో అనిపిస్తోంది. దశాబ్దాలుగా రాజకీయాల్లోనే ఉన్న సంప్రదాయా కుటుంబాలు కూడా అంత భారీ ఖర్చు చేయలేవన్నది వాస్తవం. మరి పోటీలో ఎవరు నిలబడాలి? ఎంత ఖర్చు చేయాలన్నదే ప్రశ్న. మొన్ననే మున్సిపల్ వార్డులకు ఎన్నికలు జరిగాయి. గుడివాడ మున్సిపాలిటిలోని 16వ వార్డులో టిడిపి అభ్యర్ధి ఓటుకు సుమారు 10 వేల రూపాయలు వ్యయం చేసారట. ఈ మాటను టిడిపి నేతలే చెబుతున్నారు. కొన్ని చోట్లైతే రూ. 15 వేలు కూడా ఇచ్చుకున్నారట.
వార్డు ఎన్నికలోనే ఓటుకు రూ. 10 వేలు ఇస్తే ఇక అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఇంకెంత ఇచ్చుకోవాలి? 16వ వార్డులో ఉన్నది సుమారుగా 2 వేల ఓట్లు. అందులో ఓ 500 ఓట్లను తీసేసినా మిగిలిన 1500 ఓట్లకైతే అభ్యర్ధి డబ్బులు సమర్పించుకోవాల్సిందే కదా? 1500 ఓట్లలో ఓటుకు 10 వేల చొప్పున సుమారు రూ. 1.5 కోట్లు అయ్యుంటుంది. గుడివాడ అసెంబ్లీలో 2 లక్షల ఓట్లుంటాయి. ఇందులో 50 వేల ఓట్లు తీసేసినా మిగిలిన 1.5 లక్షల ఓట్లకు పంచాల్సిందే అనుకుందాం. అప్పుడు అయ్యే ఖర్చెంత. సుమారు రూ. 150 కోట్లు. ఈ లెక్కన ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ సగటున 2 లక్షల ఓట్లుంటాయి. అంటే రాబోయే ఎన్నికల్లో అయ్యే ఖర్చును అంచనా వేసుకుని పోటీ చేయాలనుకుంటున్న వారు గుండెలు బాదుకుంటున్నారు.
ఎందుకంత వ్యయం చేస్తున్నది టిడిపి? ఆన్సర్ సింపుల్. ప్రత్యర్ధి వైసీపీ అభ్యర్ధులకు ఎన్నికల ఖర్చులు అందనంత స్ధాయికి చేరుకోవాలన్నదే చంద్రబాబునాయడు ఉద్దశ్యం కావచ్చు. 175 నియోజకవర్గాల్లో కనీసం వంద నియోజకవర్గాల్లో అభ్యర్ధులు భారీగా ఖర్చు పెట్టాల్సిందే. అంటే ఖర్చులకు భయపడే వైసీపీ అభ్యర్ధులు చేతులెత్తేయాలన్నది చంద్రబాబు ఉద్దేశ్యం కావచ్చు. అధికారంలో ఉన్నారు కాబట్టి చంద్రబాబు ఎంతైనా వ్యయం చేస్తారు. మరి ప్రతిపక్షాల పరిస్ధితి ఏమిటి?