
ఎయిడెడ్ సంస్థల విలీనంపై (aided institutions) ఏపీ విద్యాశాఖ (ap education department) అంతర్గత మెమో జారీ చేసింది. 2249 ఎయిడెడ్ విద్యాసంస్థల్లో 68.78 శాతం విద్యాసంస్థలు విలీనానికి అంగీకరించాయని ఏపీ విద్యాశాఖ ప్రకటించింది. 702 ఎయిడెడ్ విద్యాసంస్థలు అంగీకరించలేదని తెలిపింది. ఇదే సమయంలో తాము ఎయిడెడ్ విద్యాసంస్థలపై ఒత్తిడి పెట్టలేదని.. విలీనానికి 4 ఆప్షన్లు ఇచ్చినట్లు వెల్లడించింది.
ఆప్షన్ 1 : ఆస్తులు, సిబ్బందితో సహా విలీనం
ఆప్షన్ 2 : ఆస్తులు మినహా ఎయిడెడ్ సిబ్బందిని సరెండర్ చేసి ప్రైవేట్ అన్ ఎయిడెడ్‌గా కొనసాగించడం
ఆప్షన్ 3 : ప్రైవేట్ ఎయిడెడ్ సంస్థలుగా కొనసాగడం
ఆప్షన్ 4 : విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశం
మరోవైపు ఎయిడెడ్ కాలేజీల విలీనం విషయంలో ప్రభుత్వం తీరును విద్యార్ధి సంఘాలు తప్పుబట్టాయి. ఎయిడెడ్ కాలేజీలు, స్కూళ్లను విలీనం చేయడాన్ని నిరసిస్తూ అనంతపురంలోని SSBN కాలేజీ వద్ద సోమవారం నాడు విద్యార్ధులు ఆందోళన నిర్వహించారు. ఆందోళన చేస్తున్న విద్యార్ధులపై పోలీసులు లాఠీ చార్జీ (lathi charge) చేశారు. ఈ లాఠీ చార్జీని నిరసిస్తూ మంగళవారం నాడు అనంతపురంలో బంద్ నిర్వహించారు. విద్యార్ధులపై లాఠీచార్జీ చేయడాన్ని నిరసిస్తూ ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ (adimulapu suresh) మీడియా సమావేశాన్ని విద్యార్ధి సంఘాలు మంగళవారం నాడు అడ్డుకొన్నాయి. మంత్రి ప్రెస్ మీట్ నిర్వహిస్తుండగా విద్యార్ధి సంఘాల నేతలు అక్కడికి చేరుకొని మంత్రి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
Also Read:అనంతలో విద్యార్ధులపై లాఠీచార్జీ: మంత్రి సురేష్‌ను ఘోరావ్ చేసిన విద్యార్ధులు, ఉద్రిక్తత
విద్యార్ధి సంఘాల నేతలతో మంత్రి సురేష్ మాట్లాడారు. విద్యార్థి సంఘాలకు వివరణ ఇచ్చేందుకు మంత్రి ప్రయత్నం చేశారు. ఎయిడెడ్ పాఠశాలల వ్యవహారాన్ని రాజకీయ కోణంలో చూడవద్దని మంత్రి కోరారు.. లేనిపోని ఆరోపణలు చేస్తూ విద్యార్థులకు నష్టం కల్గిస్తున్నారన్నారు. ఈ విషయం తెలుసుకొన్న అదనపు పోలీస్ బలగాలు రంగంలోకి దిగాయి. మీడియా సమావేశంలో ఉన్న విద్యార్ధి సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే ఎస్ఎస్‌బీఎన్ కాలేజీలో సోమవారం జరిగిన లాఠీచార్జిలో గాయపడిన డిగ్రీ విద్యార్థిని జయలక్ష్మి ఆ ఘటన తర్వాత కనిపించకుండా పోయింది. జయలక్ష్మి మంగళవారం నాడు ఓ వీడియో విడుదల చేసింది. తాను బంధువుల ఇంట్లో క్షేమంగా ఉన్నట్లు పేర్కొంది. సోమవారం జరిగిన ఘటనతో తనకు ఫోన్ కాల్స్ ఎక్కువగా రావడంతో ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి బంధువుల ఇంటికి వెళ్లినట్లు జయలక్ష్మి తెలిపింది.