ఏపీ సీఎం వైఎస్ జగన్ రేపు విశాఖపట్టణంలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు.
విశాఖపట్టణం: ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ ఆగస్టు 1వ తేదీన విశాఖపట్టణంలో పర్యటించనున్నారు. విశాఖలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు.విశాఖపట్టణాన్ని ఏపీ రాష్ట్ర పరిపాలన రాజధానిగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విశాఖ నుండి పాలనను ప్రారంభించినున్నట్టుగా సీఎం జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఆగస్టు 1వ తేదీన రూ.600 కోట్లతో రహేజా గ్రూప్ నిర్మిస్తున్న ఇనార్బిట్ మాల్ కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత జీవీఎంసీ పరిధిలో 50 పనులకు సీఎం భూమి పూజ చేస్తారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉపాధి, నైపుణ్య అవకాశాల్ని కల్పించే నాలుగు ప్రాజెక్టులను సీఎం ప్రారంభిస్తారు.
ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా విశాఖను ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ప్రభుత్వం పలు ప్రాజెక్టులను విశాఖలో ఏర్పాటు చేయనుంది. విశాఖలో ఐటీ హబ్ గా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది.
జీవీఎంసీ పరిధిలో రూ. 135.88 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం జగన్ పాల్గొంటారు. అమృత్ 2.0, స్మార్ట్ సిటీ,మధురవాడ, లంకెలపాలెం, గాజువాక, అనకాపల్లి తాగునీటి కష్టాలను తీర్చేలా పైప్ లైన్ ప్రాజెక్టులకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు..ఇన్ఆర్బిట్ మాల్ నిర్మాణంలో భాగంగా ఐటీ టవర్స్ ను కూడ రహేజా గ్రూప్ నిర్మించే అవకాశం ఉంది. ఈ మేరకు రహేజా సంస్థ ప్రతినిధులకు ఈ విషయమై సూచన చేశారని సమాచారం. సీఎం సూచన పట్ల రహేజా గ్రూప్ కూడ సానుకూలంగా ఉందని సమాచారం.ఆంధ్ర యూనివర్శిటీలో రూ. 129 కోట్లతో చేపట్టే పనులను సీఎం ప్రారంభిస్తారు.ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖిలో ఆయన పాల్గొంటారు.