గంగవరం పోర్టులోకి చొచ్చుకెళ్లేందుకు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు యత్నించారు. స్టీల్ ప్లాంట్ కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు.
విశాఖపట్టణం: గంగవరం పోర్టులోకి చొచ్చుకెళ్లేందుకు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ప్రయత్నించారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. స్టీల్ ప్లాంట్ కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు.గంగవరం పోర్టుకు విశాఖస్టీల్ ప్లాంట్ రూ. 50 కోట్లు బకాయి ఉంది. దీంతో గంగవరం పోర్టులో ఉన్న విదేశీ బొగ్గును విశాఖ స్టీల్ ప్లాంట్ కు తరలించకుండా గంగవరం పోర్టు యాజమాన్యం అడ్డుకుంటుందని విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆరోపిస్తున్నారు.
విదేశాల నుండి వచ్చిన రెండు లక్షల 68 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు గంగవరంపోర్టులోనే ఉంది. అయితే స్టీల్ ప్లాంట్ తమకు బకాయి ఉన్న రూ. 50 కోట్లు చెల్లిస్తేనే ఈ బొగ్గును తరలించేందుకు అనుమతిస్తామని పోర్టు యాజమాన్యం తేల్చి చెప్పింది. బొగ్గు లేకపోవడంతో విశాఖ స్టీల్ ప్లాంట్ పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయలేకపోతున్నట్టుగా కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు.
undefined
విశాఖ స్టీల్ ప్లాంట్ లో 7.1 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. అయితే బొగ్గు సరిపోను లేకపోవడంతో కేవలం 2 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి మాత్రమే చేస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు కార్మిక సంఘాలు.
గాజువాక బాలచెరువు వైపు స్టీల్ ప్లాంట్ గేటు నుండి ప్రవేశించారు కార్మికులు. పోర్టు గేటు వద్దకు వెళ్లిన కార్మిక సంఘాల ప్రతినిధులు. గంగవరం పోర్టు గేటు వద్ద స్టీల్ ప్లాంట్ కార్మికులు బైఠాయించి ఆందోళనకు దిగారు. ఆందోళనకు దిగిన కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో వైపు గంగవరం పోర్టు వైపు వెళ్లే బ్రిడ్జిని పోలీసులు మూసివేశారు.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో 900 రోజులుగా ఆందోళనలు సాగుతున్న విషయం తెలిసిందే.