దేవుడు స్క్రిప్ట్ రాస్తే ఇలాగే ఉంటుంది: చంద్రబాబు పై సీఎం జగన్ సెటైర్లు

By Nagaraju penumalaFirst Published Jun 3, 2019, 7:24 PM IST
Highlights

దేవుడు స్క్రిప్ట్ రాస్తే ఎలా ఉంటుందో ఈ ఎన్నికల ఫలితాలు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చన్నారు. మే 23న రంజాన్‌ మాసంలోనే ఫలితాలు వచ్చాయి. టీడీపీకి కేవలం 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు మాత్రమే మిగిలారు. ఇంతకంటే గొప్ప విషయం ఏముంటుందన్నారు. 

గుంటూరు: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సెటైర్లు వేశారు. గతంలో తమ పార్టీ ఎమ్మెల్యేలను లాక్కున్న చంద్రబాబుకు అంతేమంది ఎమ్మెల్యేలను ఇచ్చాడని ఇది చాలా ఆశ్చర్యకరమైన తీర్పు అంటూ పంచ్ వేశారు. 

పవిత్ర రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం సోదరులకు ఇచ్చిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తాను తొలిసారిగా అధికారికంగా హాజరైన తొలికార్యక్రమం ఈ ఇఫ్తార్ విందు అంటూ చెప్పుకొచ్చారు. 

పవిత్రమైన రంజాన్ మాసంలోనే జగన్ అనే నేను అంటూ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారనని తెలిపారు. అలాగే తొలి సంతకం కూడా చేశానని, తొలి పర్యటన కూడా రంజాన్ మాసంలోనే ప్రారంభించానని తెలిపారు. 

దేవుడు ఎన్నో ఆశ్చర్యకర పనులు చేస్తుంటాడని అలాగే ఆశ్చరర్య పడేలాంటి తీర్పును కూడా ఇస్తాడని వైయస్ జగన్ స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో చంద్రబాబు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను అన్యాయంగా ప్రలోభాలకు గురిచేసి కొనుగోలు చేశారని తెలిపారు. 

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా స్పీకర్‌ దాటవేత ధోరణితో వ్యవహరించారని గుర్తు చేశారు. వారిపై వేటు వేయాల్సింది పోయి వారిలోనే నలుగురికి మంత్రి పదవులను సైతం కట్టబెట్టారని చెప్పుకొచ్చారు. 

అలాగే రాష్ట్రంలో 9 మంది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గెలిస్తే ముగ్గురుని ఇదే మాదిరిగా లాక్కున్నారని స్పష్టం చేశారు. దేవుడు స్క్రిప్ట్ రాస్తే ఎలా ఉంటుందో ఈ ఎన్నికల ఫలితాలు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చన్నారు. మే 23న రంజాన్‌ మాసంలోనే ఫలితాలు వచ్చాయి. 

టీడీపీకి కేవలం 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు మాత్రమే మిగిలారు. ఇంతకంటే గొప్ప విషయం ఏముంటుందన్నారు. తమ దగ్గర నుంచి 23 మందిని అన్యాయంగా లాక్కుంటే అదే 23 మంది మిగిలారని, అలాగే ముగ్గురు ఎంపీలను లాక్కుంటే ముగ్గురు మాత్రమే మిగిలారని సీఎం వైయస్ జగన్ స్పష్టం చేశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

తొలి ఎమ్మెల్సీ ప్రకటించిన సీఎం వైయస్ జగన్

click me!