చంద్రబాబుకు ఓటేస్తే.. చంద్రముఖిని ఇంటికి తెచ్చుకున్నట్లే , చొక్కా చేతులు మడిచే టైమొచ్చింది : వైఎస్ జగన్

By Siva Kodati  |  First Published Feb 15, 2024, 6:22 PM IST

బాబుకు ఓటు వేయడమంటే ఐదేళ్ల క్రితం వదిలించుకున్న చంద్రముఖిని మళ్లీ ఇంటికి తీసుకురావడమేనని సెటైర్లు వేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్. చంద్రబాబుకు ఓటు వేయడమంటే దాని అర్ధం ఇప్పుడు అమలవుతున్న పథకాల రద్దుకు ఆమోదం తెలిపినట్లేనని వైసీపీ అధినేత వ్యాఖ్యానించారు.
 


గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో జరిగిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ఏపీ సీఎం , వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీని అధికారంలో నుంచి దింపడానికి జన్మభూమి కమిటీలే కారణమన్నారు. ఒక్క రూపాయి లంచం లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని.. లంచం లేని వివక్ష లేని వ్యవస్ధ తీసుకురావాలన్నదే వాలంటీర్ల వ్యవస్ధ లక్ష్యమని సీఎం తెలిపారు. మరో రెండు నెలల్లో యుద్ధానికి సిద్ధమా..అని వైసీపీ శ్రేణులను ఆయన ఉత్సాహపరిచారు.

జన్మభూమి కమిటీలు దోపిడీ కోసం పుట్టాయని.. వాలంటీర్లు రాబోయే రోజుల్లో లీడర్లు కాబోతున్నారని జగన్ పేర్కొన్నారు. 58 నెలలు అలసిపోకుండా పేదలకు సేవ చేశామని.. మనం ఏర్పాటు చేసిన వ్యవస్ధలు గ్రామ రూపు రేఖలను మార్చేశాయన్నారు. గత పాలనకు, మన పాలనకు తేడా చూడాలని.. ఆర్బీకే వ్యవస్ధ రైతన్నకు కొండంత అండగా నిలబడుతుందని జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. 2 లక్షల 60 వేల వాలంటీర్లు నా సైన్యమన్న ఆయన.. గ్రామస్థాయిలో విలేజ్ క్లినిక్‌లు ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు.

Latest Videos

2019కి ముందు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్ధితి వుండేదని.. జన్మభూమి కమిటీలు సిఫార్సు చేస్తే తప్ప.. పనులు జరగవన్నారు. గతంలో పెన్షన్ కావాలన్నా లంచం, రేషన్ కావాలన్నా లంచం, చివరికి మరుగుదొడ్లు కావాలన్నా లంచం ఇవ్వాల్సి వచ్చేదని జగన్ గుర్తుచేశారు. కులం, మతం పేరుతో మనుషులను విభజించి పాలించారని ఆయన ఆరోపించారు. గత పాలనలో స్కీములు లేవు, బటన్‌లు లేవని.. చంద్రబాబు పాలన విష వృక్షమైతే, మన పాలన కల్పవృక్షమన్నారు. జన్మభూమి కమిటీలు గంజాయి మొక్కలైతే, మన వాలంటీర్లు తులసి మొక్కలని జగన్ పేర్కొన్నారు. 

తన పాలనకు మీరంతా బ్రాండ్ అంబాసిడర్లని.. జన్మభూమి కమిటీలకు, వాలంటీర్లకు మధ్య జరుగుతున్న యుద్ధమన్నారు. ఇవాళ్టీ నుంచి వారం రోజుల పాటు వాలంటీర్లకు అభినందన సభలు నిర్వహిస్తామని జగన్ తెలిపారు. 58 నెలల్లో రూ.2 లక్షల 55 వేల కోట్లు అక్కచెల్లమ్మల ఖాతాలో జమం చేశామని.. కేంద్రం నుంచి ఆదాయం తగ్గినా తట్టుకున్నామని ఆయన వెల్లడించారు. చంద్రబాబు హైదరాబాద్‌లోని ఇంట్లో కూర్చుంటారని.. వాళ్ల మేనిఫెస్టోలో బాగా పనిచేసినవి తీసుకుని కిచిడీ తయారు చేస్తారని జగన్మోహన్ రెడ్డి సెటైర్లు వేశారు. ప్రజలు అధికారం ఇవ్వరని తన మార్క్ గ్యాంబ్లింగ్ మొదలుపెట్టాడని.. ఎలాగూ ఇచ్చేది లేదు కాబట్టి, ఏదేదో చెబుతారని ఆయన ఆరోపించారు.

జగన్ బటన్ నొక్కితే శ్రీలంక అవుతుందన్న బాబు, ఇప్పుడు ఆరు వాగ్ధానాలంటున్నారని .. ఇతర రాష్ట్రాల్లో ఇచ్చిన మేనిఫెస్టోను తెప్పించుకుంటారని జగన్ సెటైర్లు వేశారు. ఈ ఆరు శాంపుల్స్ మాత్రమేనని చెబుతున్నారని.. అమలుకు సాధ్యం కానీ హామీలు ఇస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు మేనిఫెస్టో ఎన్నికలయ్యే వరకు రంగు రంగుల పేజీలతో వుంటుందని.. ఎన్నికలయ్యాక కనీసం వాళ్ల వెబ్‌సైట్‌లో కూడా కనిపించదని ముఖ్యమంత్రి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

చంద్రబాబు హామీలు నమ్మితే బంగారు కడియం ఇస్తామన్న పులి కథే అవుతుందని జగన్ జోస్యం చెప్పారు. ఇక చొక్కా స్లీవ్స్ మడచాల్సిన సమయం వచ్చిందని.. చంద్రబాబుకు ఓటు వేయడమంటే దాని అర్ధం ఇప్పుడు అమలవుతున్న పథకాల రద్దుకు ఆమోదం తెలిపినట్లేనని వైసీపీ అధినేత వ్యాఖ్యానించారు. బాబుకు ఓటు వేయడమంటే మన పిల్లల బంగారు భవిష్యత్‌ను తాకట్టుపెట్టడమేనన్నారు. బాబుకు ఓటు వేయడమంటే ఐదేళ్ల క్రితం వదిలించుకున్న చంద్రముఖిని మళ్లీ ఇంటికి తీసుకురావడమేనని .. చంద్రబాబు వస్తాడు, చంద్రముఖిలు వస్తాయని ఆయన సెటైర్లు వేశారు.

చంద్రబాబు వస్తే , చంద్రముఖీలు వస్తాయని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పాలని జగన్ వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మన మీద దాడి చేస్తోంది చంద్రబాబు ఒక్కడే కాదు, ఓ జాతీయ పార్టీ, పరోక్షంగా మరో జాతీయ పార్టీ కూడా అన్నారు. ఒక పక్క జగన్, మరో పక్క దుష్ట చతుష్టయం వుందని.. మిమ్మల్ని చూస్తే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరుగెడతాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మహిళల అదృశ్యానికి వాలంటీర్లే కారణమని ఒకడు అంటాడని, తనకు అధికారమిస్తే వాలంటీర్ల నడుం విరగ్గొడతానని ఇంకొకడు అంటాడంటూ విపక్షాలపై జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీ ఇంట్లోని పిల్లాడు అనర్గళంగా ఇంగ్లీష్‌లో మాట్లాడతాడని సీఎం అన్నారు. 

click me!