నా వల్ల కాదు , చీరాలకు వెళ్లిపోతానంటోన్న ఆమంచి.. మరి పర్చూరు వైసీపీ అభ్యర్ధి ఎవరు..?

Siva Kodati |  
Published : Feb 15, 2024, 04:23 PM ISTUpdated : Feb 15, 2024, 04:24 PM IST
నా వల్ల కాదు , చీరాలకు వెళ్లిపోతానంటోన్న ఆమంచి.. మరి పర్చూరు వైసీపీ అభ్యర్ధి ఎవరు..?

సారాంశం

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కీలక నియోజకవర్గం పర్చూరులో అభ్యర్ధి ఎంపిక వైసీపీకి తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ప్రస్తుత ఇన్‌ఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్‌ను.. చీరాల నుంచి తీసుకొచ్చి పర్చూరు బాధ్యతలు అప్పగించారు. ఆయన బలం, బలగం మొత్తం చీరాలలోనే వుండగా.. ఇక్కడ తీవ్రంగా కష్టపడాల్సి వస్తోంది. 

వచ్చే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించాలని గట్టి పట్టుదలతో వున్నారు ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్. సర్వేలు, తనకున్న సమాచారం ఆధారంగా గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయిస్తు వస్తున్న ఆయన వ్యతిరేకత వుంటే బంధువులు, ఆత్మీయులు, సన్నిహితులను సైతం పక్కనపెట్టేస్తున్నారు. కొందరికి టికెట్లు నిరాకరిస్తే.. ఎంపీలను ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్యేలను ఎంపీలుగా పోటీ చేయిస్తున్నారు. మరికొందరిని నియోజకవర్గాలు కూడా మార్చేస్తున్నారు. ఈ నెలాఖారు నాటికి పూర్తి అభ్యర్ధుల జాబితా ప్రకటించి.. ఇకపై పూర్తిగా ప్రజల్లోనే వుండాలని జగన్ కృతనిశ్చయంతో వున్నారు. 

అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కీలక నియోజకవర్గం పర్చూరులో అభ్యర్ధి ఎంపిక వైసీపీకి తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ప్రస్తుత ఇన్‌ఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్‌ను.. చీరాల నుంచి తీసుకొచ్చి పర్చూరు బాధ్యతలు అప్పగించారు. ఆయన బలం, బలగం మొత్తం చీరాలలోనే వుండగా.. ఇక్కడ తీవ్రంగా కష్టపడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో పర్చూరులో తనవల్ల కావడం లేదని కృష్ణ మోహన్ తేల్చేశారు. ఇక్కడ పోటీకి ఆసక్తి లేకపోవడంతో పాటు స్థానిక కేడర్ ఆమంచిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వుండటంతో ఆయన తిరిగి చీరాలలోనే పోటీ చేయాలని భావిస్తున్నారు. 

చీరాలలో సిట్టింగ్ ఎమ్మెల్యే కరణం బలరాం తాను కానీ తన కుమారుడు వెంకటేష్‌ను కానీ బరిలో దిగాలని భావిస్తున్నారు. చీరాల వైసీపీలో ఇప్పటికే కరణం, ఆమంచి, పోతుల గ్రూపులు వున్నాయి. వీరు ఎవరికి వారుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చీరాలలో ఆమంచి కృష్ణ మోహన్ మద్ధతు లేకుండా వైసీపీ గెలవడం కష్టం. కాపు సామాజిక వర్గంతో పాటు చేనేత కులాలైన పద్మశాలి, దేవాంగ వర్గాలదే ఇక్కడ ఆధిపత్యం. ఆ వర్గాల్లో పట్టున్న ఆమంచి.. తనకు టికెట్ దక్కని పక్షంలో ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేస్తానంటున్నారు. గతంలో స్వతంత్ర అభ్యర్ధిగా గెలిచిన ట్రాక్ రికార్డ్ ఆయనకు వుంది. చీరాలలో ఆమంచిని ఎలాగోలా బుజ్జగించినా.. మరి పర్చూరు సంగతేంటనేది వైసీపీ నేతలకు అంతుబట్టడం లేదు. 

కమ్మ సామాజికవర్గం ప్రాబల్యం అధికంగా వున్న పర్చూరు నుంచి కాపు నేతను బరిలోకి దింపాలనేది వైఎస్ జగన్ వ్యూహం. దీనిలో భాగంగానే ఆమంచిని అక్కడికి పంపారు. కానీ ఆయన చేతులెత్తేయడంతో దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, వ్యాపారవేత్త రవిశంకర్‌లలో ఒకరిని బరిలోకి దింపే అవకాశాలను వైసీపీ నేతలు పరిశీలిస్తున్నారు. పర్చూరులో కమ్మ సామాజికవర్గం ఎక్కువగా వున్నందున చీరాల ఎమ్మెల్యే కరణం కుటుంబాన్ని అక్కడికి మార్చి.. తనకు చీరాలను తిరిగి ఇవ్వాలని ఆమంచి అధిష్టానాన్ని కోరుతున్నారు. మరి ఆమంచి కృష్ణ మోహన్ తన పంతం నెగ్గించుకుంటారా..? లేక అధిష్టానాన్ని ధిక్కరించి చీరాలలో ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతారా అన్నది వేచి చూడాలి. 
 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Rain Alert : హిందూ మహాసముద్రం తుపాను.. భారీ నుండి అతిభారీ వర్షాలు, ప్లాష్ ప్లడ్స్ అల్లకల్లోలం
CM Chandrababu Naidu: జిల్లా కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు| Asianet News Telugu