కొత్త వ్యూహాలు, సరికొత్త సంస్కరణలతో ముందుకు... ఆదాయం పెంపే లక్ష్యం: అధికారులకు సీఎం దిశానిర్దేశం

By Arun Kumar PFirst Published Aug 19, 2021, 4:38 PM IST
Highlights

రాష్ట్ర ఆదాయ వనరులను పెంచడానికి కొత్త వ్యూహాలు, సరికొత్త మార్గాలు, వినూత్న సంస్కరణలతో ముందుకు పోవాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు.

అమరావతి: రాష్టానికి ఆదాయవనరులు అందించే రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్, జీఎస్టీ, ఎక్సైజ్‌ శాఖలపై గురువారం క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి రావాల్సిన బకాయిలపై దృష్టిపెట్టాలని సీఎం సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు ఆదేశించారు.

''ప్రస్తుతం ఉన్న ఆదాయ వనరుల పరిస్థితులను మరింత మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాలి. ప్రతిఏటా సహజంగానే పెరిగే ఆదాయ వనరులపై దృష్టిపెట్టాలి. జీఎస్టీ వసూళ్ల ద్వారా కూడా అధిక ఆదాయం వచ్చేలా చూసుకోవాలి'' అని సీఎం అధికారులను ఆదేశించారు. 

''రాష్ట్రానికి ఆదాయం వచ్చే కొత్త మార్గాలపైన కూడా దృష్టిపెట్టండి. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు ప్రజలకు అందేలా చేయడం కలెక్టర్లు, జేసీల బాధ్యత.  అయితే ఇదొక్కటే కాకుండా ప్రభుత్వానికి రావాల్సిన రెవిన్యూ వసూళ్లపైనా వీరు దృష్టిపెట్టాలి. కొత్త వ్యూహాలు, కొత్త మార్గాల ద్వారా ఆదాయ వనరులను పెంచుకోవాలి. దీనికోసం వినూత్న సంస్కరణలను తీసుకురావాలి'' అని సీఎం ఆదేశించారు. 

read more   నకిలీ చలానాల స్కామ్.. ఏసీబీ దిగితే కానీ బయటపడలేదు, మీరంతా ఏం చేస్తున్నారు: అధికారులపై జగన్ ఆగ్రహం

''ప్రభుత్వంలోని వివిధ శాఖల మధ్య సమన్వయం ఉండాలి. ముఖ్యంగా మున్సిపల్, విద్యుత్‌ తదితర శాఖల మధ్య సమన్వయం ఉండాలి. సరైన కార్యాచరణ ద్వారానే ప్రజలకు చక్కగా సేవలు అందుతాయి... అలాగే ఆదాయాలు కూడా పెరుగుతాయి'' అని అన్నారు.

'' కనీసంగా వారం పదిరోజులకు ఒకసారయినా అధికారులు సమావేశం కావాలి. ఆదాయ వనరులు, పరిస్థితులపై సమీక్షచేయాలి. వివిధ రంగాల వారీగా సమీక్ష చేయాలి. ప్రతి సమావేశంలో ఒక రంగంపై సమీక్ష చేపట్టాలి. సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలును తదుపరి వారంలో పరిశీలన చేయాలి'' సీఎం జగన్ సూచించారు.

''మద్యం అక్రమ రవాణాను పూర్తిగా అడ్డుకోవాలి. మద్యం అక్రమ రవాణా, కల్తీలపై ఉక్కుపాదం మోపండి. మద్యం వినియోగాన్ని తగ్గించడానికి పలు చర్యలు తీసుకున్నాం. దీనివల్ల సరిహద్దులనుంచి అక్రమంగా రాష్ట్రంలోకి మద్యం వస్తున్న ఘటనలు చూస్తున్నాం. ఇలాంటి వ్యవహారాలపై కచ్చితంగా ఉక్కుపాదం మోపాలి'' అని సీఎం జగన్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
 

click me!