వరద ప్రభావిత ప్రాంతాలకు వస్తున్నా .. సాయంపై ఫిర్యాదులు రాకూడదు : అధికారులకు జగన్ హెచ్చరిక

Siva Kodati |  
Published : Aug 03, 2023, 08:32 PM IST
వరద ప్రభావిత ప్రాంతాలకు వస్తున్నా .. సాయంపై ఫిర్యాదులు రాకూడదు : అధికారులకు జగన్ హెచ్చరిక

సారాంశం

వరద ప్రభావిత ప్రాంతాలకు తాను పరిశీలనకు వచ్చినప్పుడు సాయంపై ఎవ్వరూ ఫిర్యాదులు చేయకూడదని ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారులను హెచ్చరించారు. సహాయ పునరావాస కార్యక్రమాల్లో ఉదారంగా వ్యవహారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 

భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం అధికారులతో తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. అల్లూరి, ఏలూరు, ప.గో, తూ.గో, అంబేద్కర్ కోనసీమ జిల్లాల కలెక్టర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. విమర్శలకు తావు లేకుండా వరద బాధిత ప్రాంతాల్లో సహాయ పునరావాస కార్యక్రమాలు జరగాలని ఆదేశించారు.

కలెక్టర్లు, అధికారులకు విపత్తుల సమయంలో ముందస్తుగానే నిధులు విడుదల చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు. నిధుల విడుదల తర్వాత పనులు చేయడానికి కొంత సమయం ఇస్తున్నామని.. ఆ తర్వాత తానే స్వయంగా వచ్చి సహాయ పునరావాస కార్యక్రమాలను పరిశీలిస్తానని జగన్ తెలిపారు. సహాయ పునరావాస కార్యక్రమాల్లో ఉదారంగా వ్యవహారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఇంట్లోకి వరద నీరు వచ్చినా, వరద కారణంగా సంబంధాలు తెగిపోయిన వారికి రేషన్ అందించాలని జగన్ సూచించారు. సహాయ శిబిరాల్లో వుండి.. వారు తిరిగి ఇళ్లకు వెళ్లటప్పుడు ప్రతి కుటుంబానికి రూ.2000, వ్యక్తులైతే రూ.10,000 ఇచ్చి పంపాలని జగన్ ఆదేశించారు. కలెక్టర్లు తమను బాగా చూసుకున్నారనే మాట వినిపించాలని.. ఇళ్లు ఎలా ధ్వంసమైనా వారందరికీ రూ.10 వేల చొప్పున సాయం అందించాలని జగన్ ఆదేశించారు. 

Also Read: యూనివర్సిటీలు, ట్రిపుల్ ఐటీల్లో పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్..

వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలను కొంతకాలం పాటు కొనసాగించాలని ముఖ్యమంత్రి సూచించారు. వరద నీరు తగ్గగానే పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని.. పీహెచ్‌సీల్లో, విలేజ్ క్లినిక్స్‌లో సరిపడా మందులు వుండేలా చూసుకోవాలని జగన్ ఆదేశించారు. పంట నష్టం, ఆస్తినష్టంపై వివరాలు సేకరించి గ్రామ, వార్డు సచివాలయాల్లో జాబితాను అందుబాటులో వుంచాలని సీఎం సూచించారు.

పంట నష్టం, ఆస్తి నష్టం తాలూకు పరిహారాన్ని అత్యంత పారదర్శకంగా అందించాలని జగన్ పేర్కొన్నారు. అవసరమైన చోట కొత్త ఇళ్లను మంజూరు చేయాలని .. అవసరమైన స్థలాన్ని సేకరించి, వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సీఎం సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాలకు తాను పరిశీలనకు వచ్చినప్పుడు ఈ అంశాలకు సంబంధించి ఎవ్వరూ ఫిర్యాదులు చేయకూడదని జగన్ హెచ్చరించారు. 


 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే