
టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు బుధవారం సీఎం సొంత నియోజకవర్గం పులివెందులలో నిర్వహించిన సభపై సెటైర్లు వేశారు వైసీపీ నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పులివెందుల సభ సక్సెస్ అనుకుని కొడమసింహంలా ఉంటే మంచిదేనన్నారు. ప్రతిపక్షం బలంగా ఉంటేనే పోటీ బావుంటుందని సజ్జల అభిప్రాయపడ్డారు. చంద్రబాబు, జగన్‌లు ఏం చేశారో జనం చెప్తున్నారని చురకలంటించారు.
పులివెందులకు ఎన్టీఆర్ హయాం దగ్గర్నుంచి ఎవరో ఒకరు వస్తున్నారని ..రేణుకా చౌదరి పులివెందులలో తొడగొట్టిందని ఇలాంటివి చాలా జరిగాయని రామకృష్ణారెడ్డి సెటైర్లు వేశారు. చంద్రబాబు కుప్పంలో కనీసం ఇల్లు కూడా కట్టుకోలేదని ఆయన దుయ్యబట్టారు. సునీత పేరు చంద్రబాబు చెప్పడంతో ఆయన మద్దతు ఎవరికో అర్ధం అవుతోందన్నారు. కుటుంబంలో చీలిక కోసం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.
ALso Read: ఆయనలా హడావుడి చేయం.. వరద బాధితులకు నేరుగా సాయం : చంద్రబాబుపై సజ్జల విమర్శలు
ఆర్ ఫైవ్ జోన్‌పై ఖచ్చితంగా సుప్రీం కోర్ట్‌కు వెళతామన్నారు. సీఎం జగన్ పేదల పక్షాన ఉన్నారని, చంద్రబాబు పెత్తందారీ వ్యవస్థతో ఉన్నారని రామకృష్ణారెడ్డి ఆరోపించారు. అమరావతికి ఇచ్చిన భూముల్లో రైతుల ఇష్టాల ప్రకారం నడవడం ఏంటి.. అదేమైనా రియల్ ఎస్టేట్ వ్యాపారమా అని సజ్జల ప్రశ్నించారు. బయటివాళ్ళని తెచ్చి ఎలా అక్కడ ఇల్లు ఇస్తారు అంటున్నారు.. ఇవ్వకూడదా అని రామకృష్ణారెడ్డి నిలదీశారు. కరకట్ట లాంటి చిన్న రోడ్ పెట్టుకుని బాబు కాలం గడిపేసాడని ఆయన దుయ్యబట్టారు.
రియల్ రైతులకు రేట్లు రాకుండా ఎవరెవరికో మేలు చేసి చంద్రబాబు భూములు సింగపూర్‌కు అప్పగించారని సజ్జల ఆరోపించారు. అమరావతి ప్రాంతంలో అభివృద్ధిపై జగన్ దృష్టి పెట్టారని ఆయన పేర్కొన్నారు. పేదలకు ఇళ్ళు ఇస్తే వాటిని కాదని రాజకీయ పార్టీలు మనుగడ సాగిస్తాయా అని రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వానికి విస్తృత అధికారాలు ఉంటాయని.. కోర్ట్‌లో విజయం సాధిస్తుందని సజ్జల ధీమా వ్యక్తం చేశారు.