కరోనాపై జగన్ సమీక్ష: లాక్‌డౌన్ సడలింపులు... ప్రత్యేక కార్యాచరణపై చర్చ

By Siva KodatiFirst Published May 1, 2020, 5:14 PM IST
Highlights

కరోనా నివారణా చర్యలు, లాక్‌డౌన్ అమలుపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 

కరోనా నివారణా చర్యలు, లాక్‌డౌన్ అమలుపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్వారంటైన్‌ కేంద్రాల్లో సదుపాయాలు, పారిశుద్ధ్యం, భోజనం తదితర అంశాలపై క్రమం తప్పకుండా సమీక్ష చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ సదుపాయాలు అందుతున్నాయా లేదా అన్నదానిపై క్వారంటైన్లో ఉన్నవారి నుంచి ఎప్పటికప్పుడు అభిప్రాయాలు తీసుకుంటున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. లాక్‌డౌన్‌ సడలింపులు నేపథ్యంలో విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశాలున్నాయని సమావేశంలో చర్చించారు.  

వీరిని స్క్రీనింగ్‌ చేయడం, అవసరమైన వారిని క్వారంటైన్‌కు తరలించడం తదితర అంశాలపై సమీక్షా సమావేశంలో విస్తృత చర్చించారు. వీరి సంఖ్య అధికంగా ఉండే అవకాశాలున్నందున అనుసరించాల్సిన విధానంపై ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని జగన్ సూచించారు.

Also Read:ఏపీలో కరోనా రాజధానిగా కర్నూలు: ఏ మాత్రం తగ్గని కేసుల సంఖ్య... కారణం ఏంటి..?

విదేశాలనుంచి వచ్చే వారికి దాదాపుగా నాన్‌ కోవిడ్‌ సర్టిఫికెట్‌ ఉంటుందని, వారికి హోం క్వారంటైన్‌ విధిస్తామని అధికారులు తెలిపారు. అలాగే గుజరాత్‌ నుంచి విశాఖపట్నం, విజయనగరం నుంచి వచ్చిన మత్స్యకారులకు పూల్‌ శాంపిల్స్‌ చేసి ఫలితాల ఆధారంగా ఇళ్లకు పంపిస్తామన్నారు.  

కుటుంబ సర్వే ద్వారా గుర్తించిన దాదాపు 32,792 మందిలో 17,585 మందికి పరీక్షలు, మిగిలిన వారికి 2–3 రోజుల్లో పరీక్షలు పూర్తిచేస్తామని అధికారుల వెల్లడించారు.  కోవిడ్‌ కారణంగా మరణాలు సంభవించకుండా చూడాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నామని అధికారులు సీఎంకు వెల్లడించారు.

ఈ సందర్భంగా టెలిమెడిసన్, విలేజ్‌ క్లినిక్, పీహెచ్‌సీల మధ్య సరైన సమన్వయం ఉండాలని సీఎం ఆదేశించారు. ధాన్యం సేకరణ అన్ని జిల్లాల్లో చురుగ్గా సాగుతోందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

ఒక్క కృష్ణాజిల్లాలో సేకరిస్తున్న సమయంలో బస్తాకు కొంత ధాన్యాన్ని మినహాయిస్తున్నారంటూ రైతులనుంచి వచ్చిన ఫిర్యాదులపై సమావేశంలో చర్చ. దీనిపై తీవ్రంగా స్పందించిన జగన్..  ముఖ్యమంత్రి, చీఫ్‌ సెక్రటరీ, సెక్రటరీ, డీజీపీ లాంటి వ్యక్తులంతా ఇదే కృష్ణా జిల్లాలో ఉన్నాసరే.. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం సరికాదన్నారు.

చూస్తూ ఊరుకునే పరిస్థితి వద్దని,  వెంటనే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని జగన్ అధికారులను ఆదేశించారు. పంటలను రోడ్డుమీద వేసిన ఘటనలు గత ప్రభుత్వ హయాంలో రోజూ కనిపించేవని, అలాంటి ఘటనలు ఈ ప్రభుత్వ హయాంలో కనిపించడానికి వీల్లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.  

Also Read:కరోనా టెస్టుల్లో వాయు వేగం: ఏపీ రికార్డు, 24 గంటల్లో లక్షదాటిన పరీక్షలు

రైతు భరోసా కేంద్రాలకు నెట్, విద్యుత్‌ సహా అన్ని సౌకర్యాలను వెంటనే కల్పించాలని అధికారులకు సూచించారు. ఏ ఊరిలో ఏ పంట వేయాలన్న విషయాన్ని ఆర్‌బీకేల ద్వారా అవగాహన కలిగించాలని ముఖ్యమంత్రి అన్నారు.  

రాష్ట్రస్థాయి వ్యవసాయ అడ్వైజరీ బోర్డులు, జిల్లా అడ్వైజరీ బోర్డులు, మండల అడ్వైజరీ బోర్డులు ఏర్పాటుకు సీఎం ఆదేశించారు. రాష్ట్రస్థాయి అగ్రికల్చర్‌ అడ్వైజరీ బోర్డులు, జిల్లా స్థాయి బోర్డులకు, అక్కడనుంచి మండల స్థాయి అడ్వైజరీ బోర్డులకు ఏయే పంటలు, ఎక్కడ వేయాలన్న దానిపై రైతులకు సూచనలు చేయాలని జగన్ అధికారులకు సూచించారు.

పంటలను ఇ– క్రాపింగ్‌ చేయడం, రైతు భరోసాకేంద్రాలను వినియోగించి వాటిని కొనుగోలు చేయడం తదితర ప్రక్రియలన్నీ, వ్యవస్థీకృతంగా సాగిపోవాలని సీఎం తెలిపారు. 

click me!