
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ys jagan) నూతన జిల్లాల ఏర్పాటుతర్వాత మొట్టమొదట పల్నాడు జిల్లా (palnadu district)లో పర్యటించనున్నారు. ప్రస్తుతం న్యూడిల్లీ పర్యటనలో వున్న సీఎం ఇవాళ(బుధవారం) తిరిగి రాష్ట్రానికి చేరుకోనున్నారు. రేపు(గురువారం) ఉదయం పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్నారు.
గురువారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరే ముఖ్యమంత్రి జగన్ 10.35 గంటలకు నరసరావుపేట ఎస్‌ఎస్‌ఎన్ కాలేజ్ గ్రౌండ్స్‌కు చేరుకోనున్నారు. 10.50 గంటలకు పీఎన్‌సీ కాలేజీ వద్ద కాసు వెంగళరెడ్డి విగ్రహావిష్కరణ చేపట్టనున్నారు. అక్కడినుండి11.00 గంటలకు తిరిగి స్టేడియం వద్దకు చేరుకుని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.
ఇదే కార్యక్రమంలో వాలంటీర్లను సీఎం జగన్ సత్కరించనున్నారు. అనంతరం 12.35 గంటలకు నరసరావుపేట నుంచి తాడేపల్లికి తిరుగుపయనం కానున్నారు. ఇలా సీఎం పల్నాడు పర్యటనకు సంబంధించిన వివరాలను సీఎంవో ప్రకటించింది.
ఇదిలావుంటే నిన్న,ఇవాళ న్యూడిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులతో సమావేశమవుతూ బిజీబిజీగా గడిపిన సీఎం జగన్ తిరిగి రాష్ట్రానికి పయనమయ్యారు. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశం అనంతరం డిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడినుండి ప్రత్యేక విమానంలో బయలుదేరిన సీఎం జగన్ మరికొద్దిసేపట్లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడినుండి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
మంగళవారం డిల్లీకి చేరుకున్న ప్రధాని మోదీతో పాటు హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. అలాగే ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ తో కూడా సమావేశమై ఆర్థిక అంశాలపై చర్చించారు. ఇలా నిన్ననే వచ్చిన పనిని దాదాపు పూర్తిచేసుకున్న సీఎం ఇవాళ ఉదయం నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు.