పరిస్థితులు బాగోలేదు.. ఆవనూనెపై దిగుమతి సుంకం తగ్గించండి : కేంద్ర మంత్రులకు జగన్ లేఖ

By Siva KodatiFirst Published May 13, 2022, 8:40 PM IST
Highlights

రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో దేశంలో వంట నూనెల ధరలకు రెక్కలొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో సామాన్యులు విలవిలలాడిపోతున్నారు. దీనిపై కేంద్రం సైతం దృష్టి సారింది. మరోవైపు ఆవనూనె దిగుమతిపై దిగుమతి సుంకం తగ్గించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ కేంద్రాన్ని కోరారు. 
 

కేంద్ర మంత్రులకు ఏపీ సీఎం వైఎస్ జగన్ (ys jagan mohan reddy) లేఖ రాశారు. ఆవనూనెపై (mustard oil) దిగుమతి సుంకం (import duty)  తగ్గించాలని కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ (nirmala sitharaman) , పీయూష్ గోయల్‌కు (piyush goyal) ఆయన శుక్రవారం లేఖ రాశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం (russia ukraine war) కారణంగా రాష్ట్రంలో వంట నూనెల కొరత నెలకొందని సీఎం లేఖలో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఏడాది పాటు ఆవనూనెపై దిగుమతి సుంకం తగ్గించాలని జగన్ కోరారు. 

2021-22లో దేశంలో వంటనూనెల వినియోగం 240 లక్షల మెట్రిక్‌ టన్నులు కాగా, ఇందులో 40 శాతం మాత్రమే దేశీయంగా ఉత్పత్తి అయ్యిందని, మిగిలిన 60 శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి చేసుకోవాల్సి వచ్చిందని సీఎం లేఖలో తెలిపారు. దిగుమతి చేసుకుంటున్న వంట నూనెల్లో 95 శాతం పామాయిల్‌ను ఇండోనేషియా, మలేషియాల నుంచి, 92 శాతం సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ను ఉక్రెయిన్, రష్యాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని జగన్ లేఖలో ప్రస్తావించారు. ఉక్రెయిన్, రష్యాల్లో పరిస్థితుల వల్ల ఒక్కసారిగా ప్రపంచంలో ఈ వంట నూనెలకు కొరత ఏర్పడిందని, ఈ ప్రభావం వినియోగదారులపై పడిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. 

ALso Read:Edible Oil Prices: దేశీయ అవసరాలకు కావాల్సిన వంటనూనె నిల్వలు ఉన్నాయి: కేంద్రం

దీనివల్ల సన్‌ఫ్లవర్‌తోపాటు, ఇతర వంటనూనెల ధరలు పెరిగాయని జగన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో మూడింట రెండొంతులమంది సన్‌ఫ్లవర్‌నే వాడుతారని, దీనితర్వాత పామాయిల్‌ను 28 శాతం మంది, వేరుశెనగ నూనెను 4.3 శాతం మంది వాడుతారని సీఎం వెల్లడించారు. మార్కెట్లో వంటనూనెల సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుందని జగన్ పేర్కొన్నారు. విజిలెన్స్, పౌరసరఫరాలు, తూనికలు కొలతలు శాఖలు విస్తృతంగా తనిఖీలు చేపట్టాయని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు కూడా తీసుకున్నాయని వెల్లడించారు. 

కొరతలేకుండా వంటనూనెలు సరఫరా చేయడానికి, రోజువారీగా ధరలు సమీక్షించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవడానికి టాస్క్‌ఫోర్స్‌ కూడా ఏర్పాటు చేశామని జగన్ లేఖలో తెలిపారు. తయారీదారులు, దిగుమతిదారులు, రిఫైనరీ చేసేవారితో క్రమం తప్పకుండా సమావేశాలు కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఏపీ ఆయిల్‌ఫెడ్‌ ద్వారా రైతు బజారల్లో సరసమైన ధరలకే వంట నూనెలను విక్రయిస్తున్నామని జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఇతర వంటనూనెల వినియోగంపై వినియోగదారుల్లో అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. 

ఆవాల నూనె కూడా సన్‌ఫ్లవర్‌ లానే ఉంటుందని, కెనడాలో ఎక్కువగా ఉత్పత్తి అవుతోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం ముడి ఆవనూనెపై 38.5 శాతం, శుద్ధిచేసిన ఆవనూనెపై 45 శాతం దిగుమతి సుంకం ఉందని జగన్ లేఖలో ప్రస్తావించారు. దిగుమతి చేసుకునేందుకు ఈ సుంకాలు ప్రతిబంధకంగా ఉన్నాయని పేర్కొన్నారు. వినియోగదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కనీసం ఏడాదికాలంపాటు ఆవనూనెపై దిగుమతి సుంకాలను తగ్గించాలని జగన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 

click me!