ప్రభుత్వ స్కూల్ విద్యార్ధులకు రాగి జావ : ప్రారంభించిన వైఎస్ జగన్

By narsimha lodeFirst Published Mar 21, 2023, 2:27 PM IST
Highlights

రూ.1,910 కోట్లతో 38 లక్షల విద్యార్థులకు నాణ్యమైన ఆహారం ప్రభుత్వ స్కూల్ విద్యార్ధులకు  అందిస్తున్నామని  ఏపీ సీఎం వైఎస్ జగన్  చెప్పారు.  

అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు రాగి జావ అందించే కార్యక్రమాన్ని ఏపీ  సీఎం వైఎస్  జగన్  మంగళవారంనాడు  ప్రారంభించారు. జగనన్న గోరుముద్ద పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 38 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందిస్తున్నట్లు  సీఎం తెలిపారు.రాగి జావ పంపిణీకి ఏడాదికి రూ.84 కోట్ల ఖర్చు చేయనున్నట్టుగా  సీఎం చెప్పారు.

ఇవాళ  తాడేపల్లి  క్యాంప్ కార్యాలయం నుండి  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  ఈ కార్యక్రమాన్ని  ఏపీ సీఎం జగన్ ప్రారంభించారు.  రాగి జావ అందించడం ద్వారా విద్యార్థుల్లో ఐరన్, క్యాల్షియం లోపం రాకుండా ముందుగానే నివారించవచ్చని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు.పేద విద్యార్థులకు మంచి చేసేలా దేవుడి దయతో ఈ రోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు పేర్కొన్నారు. 

అధికారంలోకి వచ్చిన మొదటిరోజు నుంచి బడి మానేసే పిల్లల సంఖ్యను తగ్గించడం ఎలా? స్కూళ్లలో సదుపాయాలను కల్పించడం ఎలా? అనే విషయమై  కేంద్రీకరించినట్టుగా సీఎం  చెప్పారు.  విద్యార్థుల్లో మేథో వికాసాన్ని పెంచడానికి  చర్యలు తీసుకున్నట్లు సీఎం  వివరించారు. గర్భవతుల నుంచి పాఠశాల విద్యా పూర్తయ్యే వరకు చిన్నారులకు పౌష్ఠికాహారం అందించే కార్యక్రమాన్ని వివిధ పథకాల ద్వారా అమలు చేస్తున్న విషయాన్ని  సీఎం  గుర్తు  చేశారు.  

 ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం, సీబీఎస్‌ఈ సిలబస్‌,  ఐఎఫ్‌ఎపీ ప్యానెల్స్‌ ఆరవ తరగతి నుంచి ఏర్పాటు, 8 వ తరగతి పిల్లలకు ట్యాబుల పంపిణీ చేస్తున్నామని  సీఎం వివరించారు.  

 అమ్మ ఒడి, విద్యాకానుక ద్వారా విద్యార్థుల చదువు భారాన్ని ప్రభుత్వమే మోస్తోందని సీఎం జగన్ తెలిపారు. ఉన్నత విద్యా చదివే విద్యార్థులకు విద్యాదీవెన, వసతి దీవెన కార్యక్రమాలు అమలు చేస్తున్నట్టుగా  సీఎం జగన్  చెప్పారు.  తమ ప్రభుత్వం రాక ముందు ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్లు ఒక్కసారి ఆలోచించుకోవాలని  ఆయన కోరారు.  

మన బడి నాడు నేడు కింద ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడాలని ఆయన  కోరారు.   ప్రభుత్వ పాఠశాలల కోసం గతంలో రూ.450 కోట్లు కూడా ఖర్చు చేయలేదని ఇయన విమర్శించారు.  తన ప్రభుత్వం గోరు ముద్ద ద్వారా మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ప్రతిష్ట్మాతకంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇందు కోసం ఏడాదికి రూ.1824 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. రోజుకో మెనూతో పిల్లలకు భోజనం పెడుతున్నామన్నారు.  పిల్లలు ఏం తింటున్నారో నిత్యం మానిటర్ చేస్తున్నానని సీఎం  చెప్పారు. 

also read:AP ICET 2023: ఏపీ ఐసెట్ కు రిజిస్ట్రేషన్లు షురూ.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..?

 గతంలో ఇలాంటి పరిస్థితులు మచ్చుకు కూడా ఉండేవి కాదన్నారు. పిల్లలకు మంచి మేనమామలా మొత్తం 15 రకాల ఆహార పదార్థాలు పిల్లలకు గోరుముద్ద ద్వారా అందిస్తున్నట్లు  సీఎం వివరించారు. వారంలో 5 రోజుల పాటు ఉడికించిన గుడ్లు, 3 రోజులు చిక్కీ, మరో 3 రోజులు  రాగి జావ ఇవ్వనున్నట్లు సీఎం జగన్ వివరించారు.. ఈ కార్యక్రమంలో సత్యసాయి ట్రస్టు భాగస్వాములు కావడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. పరీక్షలు రాయబోతున్న విద్యార్థులందరికీ  సీఎం ఆల్ ది బెస్ట్  చెప్పారు.
 

click me!