గడప గడపకు మన ప్రభుత్వం వర్క్ షాప్ ను ఇవాళ నిర్వహించారు.ఈ సమావేశంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
అమరావతి: టిక్కెట్టు కేటాయింపు విషయంలో తన నిర్ణయాన్ని పార్టీ నేతలు గౌరవించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ కోరారు. టిక్కెట్టు దక్కకపోతే తన మనిషి కాకుండా పోరన్నారు. వచ్చే ఆరు మాసాలు అత్యంత కీలకమని వైఎస్ జగన్ పార్టీ నేతలకు సూచించారు.గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్‌సీపీ ప్రజా ప్రతినిధులతో ఏపీ సీఎం వైఎస్ జగన్ మంగళవారంనాడు తాడేపల్లిలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రజా ప్రతినిధులకు సీఎం జగన్ దిశానిర్ధేశం చేశారు. ఏపీ అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత జగన్ క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించారు.
ఇక నుండి మనం గేర్ మార్చాల్సి ఉందని సీఎం వైఎస్ జగన్ ప్రజా ప్రతినిధులకు చెప్పారు. టిక్కెట్ల కేటాయింపు విషయంలో సర్వే తుది దశకు వచ్చిందని జగన్ పార్టీ నేతలకు చెప్పారు. సర్వే ఆధారంగానే టిక్కెట్ల కేటాయింపు ఉంటుందని సీఎం జగన్ తేల్చి చెప్పారు.
undefined
ఇప్పటివరకు మనం చేసిన కార్యక్రమాలు ఒక ఎత్తు... ఇకపై చేసే కార్యక్రమాలు మరో ఎత్తు అని సీఎం చెప్పారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలు సాధించడం సాధ్యమేనని జగన్ అభిప్రాయపడ్డారు.ఒంటరిగా పోటీకి విపక్షాలు వెనుకాడుతున్నాయన్నారు. అందుకే పొత్తులు పెట్టుకొని పోటీ చేయాలని ఆ పార్టీలు భావిస్తున్నాయని జగన్ చెప్పారు. మన పార్టీ, ప్రభుత్వం పట్ల ప్రజల్లో మంచి స్పందన ఉందన్నారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగులు వేయాలని సీఎం జగన్ పార్టీ ప్రజా ప్రతినిధులను కోరారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమన్వయంతో పని చేసుకోవాలని సీఎం జగన్ పార్టీ నేతలకు సూచించారు.మనమంతా ఒకే కుటుంబసభ్యులమన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష, వై ఏపీ నీడ్స్ జగన్ పేరిట ప్రభుత్వ అభివృద్ది కార్యక్రమాలపై నెల రోజుల పాటు ప్రచారం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న విషయాన్ని సీఎం జగన్ చెప్పారు.