అలా అయితేనే ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టను: కేసీఆర్‌పై బాబు సంచలనం

By narsimha lodeFirst Published Oct 7, 2018, 1:56 PM IST
Highlights

కేసీఆర్‌‌కు ప్రాధాన్యత ఇచ్చాను....  మెదక్ జిల్లాలో కరణం రామచంద్రరావుకు ప్రాధాన్యం ఉన్న సమయంలో తాను కేసీఆర్‌ను కేబినెట్‌లో చోటు కల్పించనట్టు చంద్రబాబునాయుడు  గుర్తు చేశారు

అమరావతి: కేసీఆర్‌‌కు ప్రాధాన్యత ఇచ్చాను....  మెదక్ జిల్లాలో కరణం రామచంద్రరావుకు ప్రాధాన్యం ఉన్న సమయంలో తాను కేసీఆర్‌ను కేబినెట్‌లో చోటు కల్పించనట్టు చంద్రబాబునాయుడు  గుర్తు చేశారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్‌కు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చినట్టు చంద్రబాబునాయుడు చెప్పారు.

శనివారం నాడు  అమరావతిలో జరిగిన టీడీపీ ఎంపీల సమావేశంలో చంద్రబాబునాయుడు కేసీఆర్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మెదక్ జిల్లాకు చెందిన కరణం రామచంద్రరావుకు పార్టీలో ప్రాధాన్యత ఇచ్చేవారని చంద్రబాబునాయుడు గుర్తు చేశారు. ఎన్టీఆర్ తదనంతరం తాను సీఎంగా ఎన్నికైన తర్వాత కేసీఆర్‌కు ప్రాధాన్యత ఇచ్చినట్టు చెప్పారు.

మరోవైపు తన మంత్రివర్గంలో కేసీఆర్‌కు చోటు కూడ కల్పించినట్టు ఆయన గుర్తు చేశారు.  ఆ తర్వాత తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా  బాధ్యతలు స్వీకరించిన తర్వాత తాను కేసీఆర్‌ను అలాగే గౌరవించినట్టు బాబు గుర్తు చేశారు. 

తన సహచరుడిగా  కేసీఆర్‌ను  సంబోధించేవాడిని తప్ప తక్కువగా చూడలేదని బాబు ప్రస్తావించారు.. కేసీఆర్‌ ఎలా ఉన్నా... ఎలా మాట్లాడినా నా హుందాతనం నేను నిలుపుకొన్నాను. ఆయన మాట్లాడే భాషను ప్రజలు సమర్ధిస్తారని తాను అనుకోవడం లేదని  చంద్రబాబునాయుడు  అభిప్రాయపడ్డారు.

తెలంగాణలో తాను చెప్పినట్లు టీడీపీ వింటే ఆంధ్రా రాజకీయాల్లో వేలు పెట్టనని కేసీఆర్‌ మరో మాట అన్నారని బాబు ఎంపీలతో చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లోని పార్టీలు కలిసి ఉంటే  ఢిల్లీలో ప్రాభవం పెరుగుతోందని తాను చెప్పానన్నారు. అయితే కేసీఆర్ మాత్రం పొత్తుకు అంగీకరించలేదన్నారు.

కేసీఆర్ మాట ఎవరు నమ్మాలి? ఈ ఎన్నికలు గడిచిన తర్వాత ఆయన ఎలా వ్యవహరిస్తారో ఎవరైనా చెప్పగలరా? అందుకే తెలంగాణలో  పార్టీని బతికించుకోవడానికి ఏ వ్యూహం అవసరమో ఆ వ్యూహంలో వెళ్లినట్టు చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు చెప్పారు. 

 మనవాళ్లు కోదండరాంతో, సీపీఐతో చర్చలు జరిపారు. తర్వాత కాంగ్రెస్‌ వచ్చింది. అందరూ కలిసి మహా కూటమిగా ఏర్పడ్డారని చంద్రబాబునాయుడు ఎంపీల సమావేశంలో వ్యాఖ్యానించారు. 

తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేయాలని... కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవద్దని  కేసీఆర్  షరతు పెట్టారని  బాబు  ఈ సందర్భంగా వివరించారు.  తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఇంకా పూర్తి కాక ముందే షెడ్యూల్‌ విడుదల కావడంపై ఈ సమావేశంలో కొంత ఆశ్చర్యం వ్యక్తమైంది.

సంబంధిత వార్తలు

కలుద్దామంటే కుదరదన్నాడు: కేసీఆర్ గుట్టు విప్పిన చంద్రబాబు


  
 

click me!