మాజీ మంత్రి నారాయణను ఏపీ సీఐడీ అధికారులు హైద్రాబాద్ లో విచారిస్తున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఏపీ సీఐడీ అధికారులు కూకట్ పల్లిలోని నివాసంలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ విషయంలో నారాయణను ప్రశ్నిస్తున్నారు.
హైదరాబాద్: మాజీ మంత్రి నారాయణను ఏపీ సీఐడీ అధికారులు హైద్రాబాద్ లోని కూకట్ పల్లిలో శుక్రవారంనాడు విచారిస్తున్నారు. అమరావతి రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ లో మార్పులపై నమోదైన కేసుపై సీఐడీ అధికారులు ఇవాళ విచారిస్తున్నారు. ఈ కేసు విషయమై విచారణకు రావాలని 160 సీఆర్పీసీ సెక్షన్ కింద సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.ఈ నోటీసులను ఏపీ హైకోర్టులో నారాయణ సవాల్ చేశారు.శస్త్రచికిత్స జరిగినందున కూకట్ పల్లిలోని నివాసంలోనే విచారణ జరపాలని నారాయణ తరపు న్యాయవాదులు హైకోర్టును కోరారు. ఈ విషయమై కూకట్ పల్లిలోని నివాసంలోనే నారాయణను విచారించాలని హైకోర్టు రెండు రోజుల క్రితం ఆదేశించింది.ఈ ఆదేశాల మేరకు ఏపీ సీఐడీ అధికారులు మాజీ మంత్రి నారాయణ ఇంటికి వచ్చి విచారణ చేస్తున్నారు. ఇవాళ ఉదయం 11 గంటల నుండి విచారిస్తున్నారు.
also read:మాజీ మంత్రి నారాయణకు ఊరట:ఇంట్లోనే విచారించాలని సీఐడీకి హైకోర్టుఆదేశం
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ లో మార్పులు చేశారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ ఏడాది మే 10వ ఫిర్యాదు మేరకు ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు. .ఈ ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.ఈ కేసులో చంద్రబాబునాయుడిని ఏ 1గా, మాజీ మంత్రి నారాయణను ఏ 2 గా చేర్చారు.అంతేకాదు ఈ కేసులో మరికొందరి పేర్లను కూడా చేర్చారు.ఈ కేసులో విచారణకు రావాలని 160 సీఆర్పీసీ సెక్షన్ కింద నోటీసులు జారీ చేశారు. ఈ విషయమై420, 166, 34,26,37, 120 బీ సెక్షన్ల కింద ఏపీసీఐడీ కేసులు నమోదు చేసింది.రామకృష్ణ హౌసింగ్, హెరిటేజ్ ఫుడ్స్, ఎల్ఈపీఎల్ ప్రాజెక్ట్స్, లింగమనేని అగ్రికల్చర్ పామ్స్, జయని ఎస్టేట్స్ కు లబ్ది కల్గించేలా ఇన్నర్ రింగ్ అలైన్ మెంట్స్ మార్చారని ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో నారాయణకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.