
ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకిత్తిస్తోంది. దీనికి తోడు పవన్ కల్యాణ్ ప్రధానిని కలుస్తుండటం సరికొత్త అనుమానాలకు తావిస్తోంది. తెలుగుదేశం పార్టీని బీజేపీని కలిపేందుకు జనసేనాని ప్రయత్నిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి స్పందించారు. పవన్- మోడీల భేటీతో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని పవన్ భావిస్తున్నారని.. తమ ఉద్దేశం కూడా ఆదేనని విష్ణువర్థన్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే వ్యతిరేక ఓటు టీడీపీ వైపు మళ్లకుండా చూడటమే తమ రెండు పార్టీల ఉమ్మడి లక్ష్యమని ఆయన తేల్చిచెప్పారు. టీడీపీని భుజాలపై మోయాల్సిన అవసరం బీజేపీ- జనసేనలకు లేదని ఆయన పేర్కొన్నారు. పెద్ద పార్టీలని చెప్పుకుంటున్న చాలా పార్టీలు కనుమరుగైన పరిస్థితి నెలకొందని విష్ణువర్థన్ రెడ్డి గుర్తుచేశారు.
అంతకుముందు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ.. తాము కుటుంబ, అవినీతి పార్టీలకు వ్యతిరేకమన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ తమ విధానం ఇలాగే వుంటుందని సోము వీర్రాజు స్పష్టం చేశారు. ప్రధానితో కోర్ కమిటీ జరిపే సభ్యుల సమావేశంలోనూ ఇదే చర్చ జరుగుతుందన్నారు. మోడీ- పవన్ భేటీలో రాజకీయ పరమైన అంశాలు చర్చకు వస్తాయని సోము వీర్రాజు తెలిపారు.
ALso REad:మోడీ- పవన్ భేటీ... ఏ చర్చించనున్నారంటే, సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు
ఇకపోతే...రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మోడీ- పవన్ భేటీకి ప్రాధాన్యత నెలకొంది. 2014 ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ, బీజేపీపి కూటమికి పవన్ కల్యాణ్ మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. మోదీ, పవన్ కల్యాణ్, చంద్రబాబులు కలిసి సభలలో పాల్గొని ప్రచారం నిర్వహించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమి ఏపీలో అధికారంలో వచ్చింది. అయితే 2019కి వచ్చేసరికి ఆ సీన్ పూర్తిగా మారిపోయింది. ఎన్నికలకు కొన్ని నెలల ముందే ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చేసింది.
మరోవైపు ఏపీ అభివృద్ది విషయంలో టీడీపీ, బీజేపీ తీరును పవన్ కల్యాణ్ విమర్శించారు. ఈ క్రమంలోనే ఎన్నికల్లో జనసేన, బీజేపీ, టీడీపీ వేర్వేరుగా పోటీ చేశాయి. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ ఖాతా కూడా తెరవలేదు. టీడీపీకి 23 స్థానాలు, జనసేన ఒకచోట విజయం సాధించింది. ఆ తర్వాత చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. 2020 జనవరిలో ఏపీలో జనసేన, బీజేపీ పొత్తు పెట్టకుంటున్నట్టుగా ప్రకటించారు. అప్పటి నుంచి ఆ రెండు పార్టీలు కలిసి ముందుకు సాగుతున్నాయి. అయితే రెండు పార్టీల పొత్తులో ఉన్నామని చెప్పుకోవడం తప్ప.. ఆ మేరకు ఇరు పార్టీల నాయకుల మధ్య సంబంధాలు ఉన్నట్టుగా కనిపించదు.
కొందరు ఏపీ బీజేపీ నేతలు పవన్ కల్యాణ్‌ను ప్రశంసిస్తే.. మరికొందరు తాము ఆయనకు దూరమనే సంకేతాలు పంపుతుంటారు. అయితే 2019లో భారీ విజయంతో వైసీపీ అధికారంలో వచ్చి మూడేళ్లు అయిన తరుణంలో.. జనసేన, టీడీపీలు ఆ పార్టీపై విమర్శల దాడిని పెంచుతున్నాయి. ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయమే ఉండటంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా వైసీపీపై విమర్శలు చేసేందుకు వెనకాడటం లేదు. అయితే పవన్ కల్యాణ్ కనబరుస్తున్న దూకుడు మాత్రం బీజేపీ నేతల్లో కనిపించడం లేదనే చెప్పాలి.